పోలీస్ డిపార్ట్‌మెంట్‌మీదే అప్రకటిత యుద్ధం చేస్తున్న వైఎస్ జగన్.. అదే డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి ఇటీవలే రాజీనామా చేసిన ఓ సీఐకి వైసీపీ టికెట్ కేటాయించారు. అనంతపురం జిల్లా హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి గోరంట్ల మాధవ్ వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు. మరి.. ఆ డిపార్ట్‌మెంట్ మీదే సందర్భం వచ్చినప్పుడల్లా విరుచుకుపడుతున్న జగన్.. ఒక మాజీ సీఐకి ఏకంగా పార్టీ ఎంపీ టికెట్ కేటాయించడంపైనా చర్చ జరుగుతోంది. అయితే.. గోరంట్ల మాధవ్ ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రజల పట్ల అత్యంత దురుసుగా వ్యవహరించేవాడని ఆయన గురించి తెలిసిన వాళ్లు చెబుతున్నారు. సామాన్య ప్రజానీకాన్ని లెక్క చేసేవాడు కూడా కాదని, సమస్యలు, బాధలుచెప్పుకోవడానికి వస్తే గొడ్డును బాదినట్లు బాదేవాడని అంటున్నారు. అంతేకాదు.. ఆయన ఓ సందర్భంలో విధుల్లో ఉన్న కిందిస్థాయి పోలీసులకు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన ఆడియో కూడా వైరల్ అవుతోంది. 'పబ్లిక్ ఇలా చెబితే వినరురా... ఉతకండి' అన్న ఆ మాటలు.. మాధవ్ ప్రవర్తనకు అద్దం పడుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అలా ప్రజల మీద ప్రతాపం చూపించేవాళ్లను, జనం మీద జులుం చూపించే వాళ్లనే చేరదీస్తాడన్న ఆరోపణలు ఇప్పుడు జోరుగా షికార్లు చేస్తున్నాయి. అందుకే మాజీ సీఐకి టికెట్ కేటాయించాడన్న చర్చ జరుగుతోంది. ఇది చాలా క్రియాశీలకం.. చాలా కీలకమైన సమయం. రాజకీయాలను మలుపుతిప్పేది ఇదే అంశంగా ఏపీలో జోరుగా చర్చ జరుగుతోంది. అంటే.. ఇది ఎన్నికల ప్రచారాస్త్రం కాదు. ఏపీ జనాన్ని భయాందోళనకు గురిచేస్తున్న విషయమని అంటున్నారు విశ్లేషకులు. మరి.. జగన్ వైఖరిపై రియాక్షన్ ఎలా ఉండబోతోంది ? ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి ఏ చిన్న అంశం దొరికినా.. వైఎస్ జగన్ వదిలిపెట్టడం లేదు. దాన్ని వివాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే గుంటూరు జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటే పోలీసులు కొట్టి చంపారంటూ కొద్దిరోజుల పాటు.. జనంలో ఉద్రిక్తతలు రగిలించే ప్రయత్నం చేశారు. పైగా.. రైతు కావడంతో.. అన్నదాతల్లో చర్చను లేవనెత్తే ప్రయత్నం చేశారు. కానీ.. విధుల్లో ఉన్న పోలీసులు అతన్ని గమనించి రైతును భుజాలమీద ఎత్తుకొని ఆస్పత్రికి తీసుకెళ్లడం.. అక్కడే ఉన్న మరో పోలీసు అధికారి వీడియో రికార్డు చేయడంతో వాస్తవమేంటో అందరికీ తెలిసింది. ఒకవేళ.. ఆ వీడియో గనక రికార్డ్ చేసి ఉండకపోతే.. జగన్.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను మరింత బద్‌నాం చేసేవాడని పోలీసు అధికారులే ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక.. డీఎస్పీల ప్రమోషన్ల వ్యవహారంలోనూ ఢిల్లీలో బొక్కబోర్లా పడ్డారు జగన్. దేశ రాజధానిలో మీడియా సమావేశం నిర్వహించి.. ఏపీ పోలీసుల మీద బురద చల్లేందుకు ప్రయత్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే.. ఓ ప్రధాన వ్యవస్థ అని తెలిసినా.. జాతీయ స్థాయిలో వివాదం రగిల్చే ప్రయత్నం చేశారు. ముప్పై ఏడు మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇస్తే.. వారిలో ముప్పై ఐదు మంది సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కమ్మవాళ్లు ఉన్నారని జగన్ ఆరోపించారు. అయితే.. వారిలో ఏడుగురు జగన్ సామాజిక వర్గం వాళ్లని, కమ్మ సామాజిక వర్గం వాళ్లు ఇద్దరే ఉన్నారని, మిగతావాళ్లంతా ఇతర సామాజిక వర్గాలకు చెందిన వాళ్లని అధికారులు లెక్కలతో సహా చెప్పడంతో జగన్ సైలెంట్ అయిపోయారు. ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌పైనా.. మరికొందరు పోలీసు అధికారులపైనా జగన్ అండ్ కో ఎన్నికల అధికారికి ఫిర్యాదులు చేసింది. అయితే.. ఇది కూడా బెడిసికొట్టింది. ఈ వ్యవహారంపై ఎస్పీ కోయ ప్రవీణ్ ధీటుగా బదులిచ్చారు. 'పోలీసులు చట్ట పరిధిలో వ్యవహ రిస్తారు. వారికి ఒక పార్టీనో, ఒక నేతనో ముఖ్యంకాదు. శాంతి భద్రత ల పరిరక్షణే కర్తవ్యం. నిష్పక్షపాతంగా పనిచేస్తున్న వారిపై కొందరు రాజకీయ నేతలు ఆరోపణలు చేయడం సరికాదు. నాయకులు వంద అంటారు. యూనిఫాం తీసేస్తే మేమూ మాట్లాడతాం' అని అన్నారు. పోలీసులతో పెట్టుకొని జగన్ దిద్దుకోలేని తప్పు చేశాడా ? ఎన్నికల్లో ఈ వైఖరికి తగిన రియాక్షన్ ఉండబోతోందా ? చివరికి తన వ్యవహారమే తనను నిండా ముంచబోతోందా ? నిజమే అంటున్నారు పరిశీలకులు. వ్యవస్థలను టార్గెట్ చేస్తే ఓటర్ల నుంచి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరిస్తున్నారు.