నవ్యాంధ్రకు మరో కార్ల తయారీ కంపెనీ వస్తుంది... జర్మన్ స్టార్ట్ అప్ కంపెనీ మాగ్నమ్ పిరెక్స్ (Magnum Pirex) అనే కంపెనీ భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి , ఆంధ్రప్రదేశ్లో సుమారు $ 15.5 మిలియన్ (INR 100 Cr) పెట్టుబడితో ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. బ్యాటరీ శక్తితో తయారైన స్పోర్ట్స్ కార్లు, ఫ్యామిలీ కార్స్ మరియు చిన్న ట్రక్కులను ఇక్కడ తయారు చెయ్యనున్నారు. మాగ్నమ్ పిరెక్స్ CEO హుబెర్ట్ మేన్చెర్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసారు. ఈ సమావేశంలో, చంద్రబాబు నాయుడు సమగ్ర ప్రాజెక్ట్ ప్రతిపాదనను సమర్పించమని కోరారు.
మాగ్నమ్ పిరెక్స్ CEO చెప్పిన ప్రకారం, ఈ కంపెనీ సంవత్సరానికి 12,000-15,000 ఎలక్ట్రిక్ కార్లను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. భారతదేశంలో సంవత్సరానికి 1,00,000 యూనిట్లు వరకు తయారు చేయడం మా లక్ష్యం అని ఈ సంస్థ చెప్తుంది. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో 22 ఎకరాల భూమిని కోరుతోంది. సులభంగా దిగుమతులు మరియు ఎగుమతులకు, పోర్ట్ దగ్గరగా ఉండే భూమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడుగుతుంది. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక వచ్చిన తరువాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నీ పరిశీలించి, భూమి ఇవ్వనుంది.
ఇప్పటికే నవ్యాంధ్రలో ఇసుజు, హీరో మోటోకార్ప్, కియా మోటర్స్ వంటి ఆటోమోటివ్ జెయింట్స్ తో పాటు, ఇటీవల టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ తో జరిగిన ఒప్పందంలో అమరావతి నగరంలో ఎలక్ట్రిక్ వాహనాలను అందించేందుకు ముందుకు వచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలను ఆకట్టుకుంటానికి ప్రత్యేక విధానాలను ప్రవేశపెడుతున్న కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాలకు ధీటుగా, ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన నూతన విధానంతో, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు మన రాష్ట్రం వైపు ఆకర్షితులు అవుతున్నాయి.