మహారాష్ట్రలోని గడ్చిరోలిలో గంటల వ్యవధిలోనే నక్సల్స్ మరో ఘాతుకానికి పాల్పడ్డారు. నిన్న రాత్రి దాదాపూర్‌లో 36 వాహనాలకు మావోయిస్టులు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం మధ్యాహ్నం ఓ పోలీస్ వాహనంపై ఐఈడీ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 16 మంది జవాన్లు మృతి చెందినట్లు సమాచారం. జాంబీర్ కేడ్ అటవీ ప్రాంతంలో ఐఈడీ పేలడంతో వాహనం తునాతునకలు అయ్యింది. కురికెడకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో వాహనంలో 15మంది జవాన్లు, ఒక డ్రైవర్ ఉన్నారు. అందరూ మృతి చెందారు. రాష్ట్రంలో గత రెండేళ్లలో మావోలు జరిపిన దాడుల్లో ఇదే అతిపెద్ద దాడిగా చెబుతున్నారు. గత 24 గంటల్లో ఇది రెండో దాడి. అంతకు ముందు జిల్లాలో 30 వాహనాలను దగ్దం చేశారు.
గడ్చిరోలిలో భద్రతాసిబ్బందితో వెళ్తున్న ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో 16 మంది భద్రతాసిబ్బంది మృతిచెందినట్లు సమాచారం. ఘటన సమయంలో వాహనంలో 16 మంది సిబ్బంది ఉన్నారు. పేలుడు తీవ్రతకు వాహనం తునాతునకలైంది. పేలుడు అనంతరం నక్సల్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మంగళవారం రాత్రి పురాందా-మాలేగావ్-యెర్కడ్ జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం వినియోగిస్తున్న 36 వాహనాలకు నక్సల్స్ నిప్పుపెట్టారు. ఈ నిర్మాణ పనులను అమర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే సంస్థ చేస్తోంది. ఈ కంపెనీకి దాదాపూర్‌లో దాదర్ ప్లాంట్ ఉంది. రోడ్డు నిర్మాణం కోసం వినియోగిస్తున్న వాహనాలను ఈ ప్లాంట్‌లోనే నిలిపి ఉంచారు. ఈ ప్లాంట్‌లోకి మావోయిస్టులు చొరబడి వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో రూ. 10కోట్ల మేర ఆస్తి నష్టం వాటిలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో నేడు ‘మహారాష్ట్ర దినోత్సవం’ జరుపుకుంటున్నారు. ఈ సమయంలో మావోయిస్టులు ఇలాంటి దాడులకు పాల్పడటం గమనార్హం.