మహిళల సాధికారతకు శ్రీకారం చుట్టిన తెలుగుదేశం.. వారికి రాజకీయాధికారం కట్టబెట్టే దిశగా మరింత ముందడుగు వేసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా వారికి 20 టికెట్లు కేటాయించింది. వైసీపీ, జనసేన, కాంగ్రెస్ 15 చొప్పున కేటాయించగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఆంధ్రలో కేవలం ఆరుగురు మహిళలకు టికెట్లు ఇచ్చింది. మొత్తం 175 స్థానాలకు గాను ఈ పార్టీల నుంచి 71 మంది మహిళలు మాత్రమే బరిలో నిలిచారు. సీఎం చంద్రబాబు తన సొంత జిల్లా అయిన చిత్తూరు నుంచి ముగ్గురు మహిళలకు అవకాశమిచ్చారు.
తూర్పుగోదావరి, కర్నూలు, విజయనగరం జిల్లాల్లోనూ ముగ్గురు చొప్పున అవకాశం పొందారు. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో రెండేసి టికెట్లు ఇచ్చారు. జగన్ తన సొంత జిల్లా కడపలో మహిళలకు ఒక్క సీటూ కేటాయించలేదు. వివిధ రకాల సమీకరణల వల్ల గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాల నుంచి మహిళలకు సీట్లు ఇవ్వలేకపోయారు.175 స్థానాల్లోనూ పోటీ చేస్తున్న వైసీపీ, 8 జిల్లాల్లో 15 మం ది మహిళలను బరిలో నిలిపిం ది. కడప, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క మహిళను కూడా ఎంపిక చేయలేదు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,93,45,717 మంది. వీరిలో మహిళలు 1,98,79,421, పురుష ఓటర్లు 1,94,62,339. అంటే పురుషుల కంటే 4,17,082 మంది మహిళలు అధికంగా ఉన్నారు.
కమ్యూనిస్టుల మొండిచేయి.. రాష్ట్రంలో 120 స్థానాల్లో పోటీచేస్తున్న జనసేన.. మహిళల కు 15 సీట్లు కేటాయించింది. పొత్తులో భాగంగా ఏడేసి స్థానాలను సీపీఐ, సీపీఎంలకు కేటాయించింది. కమ్యూనిస్టు పార్టీలు రెండూ ఒక్క సీటై నా మహిళలకు ఇవ్వలేదు. కృష్ణా, ప్రకాశం,నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో జనసేన మహిళలకు అవకాశమివ్వలేదు. సొంతగా బరిలోకి దిగిన కాంగ్రెస్ కూడా 15 సీట్లు కేటాయించింది. నెల్లూరు, విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన 11 జి ల్లాల నుంచి కాంగ్రెస్ మహిళలను బరిలో నిలిపింది. బీజేపీ ఆరుగురికి మాత్రమే టికెట్లిచ్చింది. చిత్తూరు, కడప,కర్నూలు, ప్రకాశం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి అవకాశమే ఇవ్వలేదు.