ఇటీవల పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఐపీఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇవ్వనుందా? వారికి బహూకరించిన పతకాలను సైతం వెనక్కి తీసుకోనుందా? అవుననే అంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు... సీబీఐ విచారణ పేరుతో కేంద్రం తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందటూ మూడురోజుల పాటు సీఎం మమత కోల్‌కతా వేదికగా భారీ ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ధర్నాలో పశ్చిమ బెంగాల్ డీజీపీ వీరేంద్ర సహా పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.
యూనీఫామ్ సర్వీసుల్లో సేవలు అందిస్తున్న అధికారులు ఓ రాజకీయ పార్టీ నిర్వహించే ధర్నాలో పాల్గొనడంపై కేంద్రం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి లేఖ రాసిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ.. మమత ధర్నాలో పాల్గొన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. సదరు ఐపీఎస్ అధికారులకు ప్రదానం చేసిన పతకాలను ఉపసంహరించుకోవడంతో పాటు కేంద్ర డిప్యూటేషన్ నుంచి కూడా వీరిని దూరంపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
పశ్చిమ బెంగాల్ డీజీపీ వీరేంద్రతో పాటు వినీత్ కుమార్ గోయల్ (ఏడీజీ, డైరెక్టర్, సెక్యూరిటీ), అనూజ్ శర్మ (ఏడీజీ లా అండ్ ఆర్డర్), గ్యాన్‌వంత్ సింగ్ (సీపీ, విధాన్ నగర్), సుప్రతిమ్ సర్కార్ (సీపీ) తదితరులపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైనట్టు వినిపిస్తోంది. కాగా కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్ అఖిల భారత సర్వీసు (ప్రవర్తనావళి) నిబంధనలు ఉల్లంఘించారనీ.. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఇంతకు ముందే లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి. అయితే కేంద్రం నుంచి తనకు ఎలాంటి అభ్యర్థన రాలేదంటూ సీఎం మమత తోసిపుచ్చారు. చిట్‌ఫండ్ కుంభకోణం కేసుల్లో సిట్ బృందానికి సారథ్యం వహిస్తున్న సీపీ... కీలక సాక్ష్యాధారాలు మాయం చేశారని సీబీఐ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే..