పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల ర్యాలీ కోసం వెళ్తున్న హెలికాప్టర్ బుధవారంనాడు దారితప్పడం ఆందోళనకు దారితీసింది. అయితే ఆ తర్వాత సరైన రూటులోకి వచ్చిన హెలికాప్టర్ అరగంట ఆలస్యంగా సభాస్థలికి చేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మమత హెలికాప్టర్ దారితప్పిన ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్‌తో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతానికి దగ్గర్లో ఉన్న చోప్రాలో మమతా బెనర్జీ ప్రసంగించాల్సి ఉంది. ఇందుకోసం మధ్యాహ్నం 1.05 గంటలకు ఆమె సిలిగురిలో హెలికాప్టర్ ఎక్కారు. నార్త్ దీనజ్‌పూర్‌లోని చోప్రాకు 1.27 గంటలకు హెలికాప్టర్ చేరాల్సి ఉండగా, 2 గంటల తర్వాత అక్కడకు చేరుకుంది.
బహిరగం సభలో ఈ విషయాన్ని మమత ప్రస్తావిస్తూ 'ఆలస్యంగా వచ్చినందుకు సారీ. సభాస్థలిని పైలట్ గుర్తించలేకపోవడంతో ఆలస్యం చోటుచేసుకుంది. ఆయన డైరెక్షన్ మర్చిపోయారు. 22 నిమిషాల్లోనే నేను ఇక్కడకు చేరుకోవాల్సి ఉండగా 55 నిమిషాలు పట్టింది' అని ఆమె తెలిపారు. కాగా, హెలికాప్టర్ పొరపాటున బీహార్‌లోకి అడుగుపెట్టిందని, దీంతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ, కలర్ట్ స్మోక్ గన్ సహాయంతో హెలికాప్టర్‌ను చోప్రాలో సురక్షితంగా పైలెట్ దింపగలిగారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మమతా బెనర్జీ జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీలో ఉండటం, ఆమె హెలికాప్టర్ దారితప్పిందన్న సమాచారంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఈ ఘటనపై వ్యాఖ్యానించేందుకు సీనియర్ పోలీసు అధికారులు నిరాకరించారు.