ప్రముఖ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)లో ఉన్నతాధికారుల లంచాల బాగోతం యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేసింది. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్‌ ఆస్థానాలను కేంద్రం సెలవులపై పంపి, అలోక్‌ వర్మ స్థానంలో సీబీఐ డైరెక్టర్ గా‌ బాధ్యతలను జాయింట్ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావుకు అప్పగించడం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శల దాడి చేస్తున్నారు. పశ్చిమ్ బంగా ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ సీబీఐని బీబీఐ అంటూ కొత్త పేరు పెట్టారు. ‘సీబీఐ ఇప్పుడు అతి తెలివి బీబీఐ (భాజపా బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) గా మారిపోయింది. చాలా దురదృష్టకరం’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

cbi 24102018 1

సీబీఐ కార్యాలయాల వేదికగా చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ పలు ఆరోపణలు గుప్పించారు. ‘సీబీఐ డైరెక్టర్ ని సెలవుల మీద ఎందుకు పంపారు? లోక్‌పాల్‌ చట్టం ద్వారా నియమించిన దర్యాప్తు సంస్థ అధికారి పై మోదీ ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం చర్యలకు ఆదేశించింది? ఆయన సర్కారు ఏ విషయాన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది?’ అని ఆయన ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ ప్రశ్నించారు. ‘అలోక్‌ వర్మను పదవి నుంచి తప్పించడానికి రఫేల్‌ ఒప్పందానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఆయన రఫేల్‌ ఒప్పందంపై విచారణ జరిపే యోచనలో ఉన్నారా? మోదీకి ఇబ్బంది కలిగించిన విషయం ఏమిటి?’ అని ఆయన మరో ట్వీట్‌లో నిలదీశారు.

cbi 24102018 1

ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ.. కేంద్ర ప్రభుత్వ చర్య చట్టానికి వ్యతిరేకమని, తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి వాటికి పాల్పడుతోందని మరోసారి ఆరోపించారు. ‘తమకు అనుకూలంగా వ్యవహరించి, అవినీతికి పాల్పడిన ఓ సీబీఐ అధికారిని రక్షించేందుకే.. మరో సీబీఐ అధికారిని మోదీ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా తొలగించింది. భాజపా అగ్ర నేతలతో ఆయనకు నేరుగా ఉన్న సంబంధాలను కప్పిపుచ్చడానికే ఈ విధంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది’ అని ఆయన ఆరోపణలు చేశారు. అవినీతిపరుల ఇళ్ల పై దాడులు చేయాల్సిన సీబీఐ తన ప్రధాన కార్యాలయంలో తానే సోదాలు చేసుకుంది. తాను మునగడమే కాదు.. దేశ అత్యున్నత గూఢచార సంస్థ రీసర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా)ను, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ని కూడా తనతోపాటు కట్టగట్టి లంచాల పంకిలంలో నిలువునా ముంచింది. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలన్నీ విశ్వసనీయత సంక్షోభంలో చిక్కుకున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read