అప్రజాస్వామిక ప్రకటనలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఆయన నామినేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం ఎన్నికల సంఘానికి తృణమూల్ కాంగ్రెస్ లేఖ రాసింది. సోమవారం పశ్చిమ బెంగాల్‌లోని శ్రీరాంపుర్‌లో జరిగిన ఎన్నికల ప్రసంగ సభలో ప్రసంగించిన మోదీ తృణమూల్‌కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ చెప్పారు. ఇలా చెప్పడం ఎమ్మెల్యేల కొనుగోలు చేసే ప్రయత్నం కిందికే వస్తుందని; ఇది రెచ్చగొట్టే ప్రకటనే కాకుండా అప్రజాస్వామికమని పేర్కొంది. ఓటర్లను ప్రలోభపెట్టడానికే ఇలాంటి ప్రకటన చేశారని, ఇది చట్టవ్యతిరేకమని తెలిపింది. తృణమూల్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారనడానికి ఆధారాలు చూపించాలంటూ ప్రధానిని అడగాలని, లేకుంటే ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయన నామినేషన్‌ను రద్దు చేయాలని ఈసీని కోరింది.
ప్రధాని స్థాయి వ్యక్తికి ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇవ్వడం తగదని తెలిపింది. అధికారంలో ఉన్న భాజపా మార్గదర్శకాలను పాటించడం లేదని ఆరోపించింది. తొలుత పుల్వామా అమరవీరులు, ఆ తరువాత మతం ఆధారంగా ఓట్లు అడిందని, ఇప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని పేర్కొంది. హుగ్లీ జిల్లాలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తూ నిస్సిగ్గుగా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్న నరేంద్ర మోదీకి ప్రధాని పదవిలో కొనసాగే హక్కు ఎంతమాత్రం లేదని అన్నారు. ఆయన నామినేషన్‌ను రద్దు చేసి, పోటీకి అనర్హునిగా ప్రకటించాలని డిమాండు చేశారు. జాతీయ నాయకులైన సుభాష్ చంద్రబోస్ వంటివారిని అందరూ ప్రేమిస్తారని, కానీ మోదీ, గబ్బర్‌సింగ్ వంటివారిని చూస్తే భయపడుతారని చెప్పారు. ఆయన ఎంతగా పగటికలలు కంటున్నా బెంగాల్‌లో విజయం సాధించలేరని అన్నారు.
మంచిరోజులు వచ్చాయంటూ ప్రచారమే తప్ప గత అయిదేళ్లుగా చేసిందేమీ లేదని విమర్శించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లోని 50వేల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. 'దమ్ముంటే ఒక్క ఎమ్మెల్యేనైనా తీసుకెళ్లండి' అండి మోదికి సవాల్ విసిరారు. 'మీలాగా ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లే సంస్కృతి మాకు లేదు' అని ఎద్దేవా చేశారు. 'బేరసారాలకు' పాల్పడుతున్న మోదీ లోక్‌సభ నామినేషన్‌ను తక్షణమే రద్దు చేయాలంటూ ఎన్నికల కమిషన్‌ను తమ పార్టీ ఫిర్యాదు చేసిందన్నారు. మోదీ వ్యాఖ్యలు రాజ్యాంగవిరుద్ధమని, అక్రమమని విమర్శించారు. 'మీకు సిగ్గుగా లేదా? మిమ్మల్ని మీరు రాజ్యాంగ పరిరక్షకుడిగా అభివర్ణించుకుంటున్నారు. గౌరవప్రదమైన రాజ్యాంగ పదవిలో ఉండి కూడా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. మీరు ప్రధానిగా, మాజీ ప్రధానిగా ఉండే హక్కు కోల్పోయారు' అంటూ మమతా బెనర్జీ ప్రధానిపై విరుచుకుపడ్డారు.