విశాఖ ఉక్కు ఉద్యమం రోజు రోజుకీ ఉదృతం అవుతుంది. నాలుగు రోజులు క్రితం కేంద్రం చేసిన ప్రకటనతో, అటు నరేంద్ర మోడీ, ఇటు జగన్ మోహన్ రెడ్డి పై, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తమ నిరసన చూపించారు. అయితే తమ ఉద్యమానికి అన్ని వర్గాల వారు మద్దతు పలకాలని, ముఖ్యంగా సినీ రంగ ప్రముఖులు, తమకు మద్దతుగా ముందుకు వచ్చి, కేంద్రం పై ఒత్తిడి తేవాలని ఇక్కడ వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీ పై రోజు రోజుకీ ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఎందుకో కానీ ఎక్కువ మంది, తెలంగాణా సమస్యలకు మద్దతు పలికినట్టు, మన సమస్యకు మద్దతు పలకటం లేదు. ఈ ఒత్తిడి మొదలైన తరువాత ఒకటీ అర మద్దతు పలికారు కానీ, పెద్దగా సినీ ఇండస్ట్రీ నుంచి మద్దతు లేదు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీ పై కోపంగా ఉన్న విశాఖ ఉక్కు ఉద్యమకారులు, ఈ రోజు తమ నిరసనను తెలుగు సినీ ఇండస్ట్రీ పై చూపించారు. ముఖ్యంగా విశాఖకు షూటింగ్ నిమిత్తం, వచ్చే వారికి, ఇక గడ్డు కాలం అనే చెప్పాలి. ప్రముఖ హీరో మోహన్ బాబు కొడుకు, మంచు విష్ణు, ఈ రోజు ఒక సినిమా షూటింగ్ నిమిత్తం విశాఖ వచ్చారు. అయితే మంచు విష్ణుకు విశాఖ ఉక్కు ఉద్యమకారులు అడ్డుకున్నారు. తమ పోరాటానికి సంఘీభావం తెలిపిన తరువాతే, ఇక్కడ షూటింగ్ లు చేసుకోవాలని డిమాండ్ చేసారు.
ఇక్కడ సినీ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి, ఏమి చేయాలి అన్నా, ఇక్కడ మా ఉద్యమానికి మద్దతు పలకాలని, తరువాతే ఏమైనా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాతో పాటు ఉద్యమంలో పాల్గునాలని, ఇక్కడ ఉద్యమంలో పాల్గునే సినిమా వాళ్ళు పాల్గుంటే తద్వారా ఉద్యమానికి గుర్తింపు వచ్చి, తమ సమస్యకు ఎక్కువ మద్దతు వస్తుందని, వారు వాపోయారు. ప్రజల్లో కూడా మరింత చైతన్యం వస్తుందని, ఇది ప్రతి తెలుగువారి సమస్య అని, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యగా చూడవద్దు అని, తమ పోరాటానికి ముందుకు రావాలని కోరారు. తెలంగాణ నుంచి సినీ రంగ ప్రముఖులు అందరూ తమకు మద్దతు ప్రకటించి, తమకు సంఘీభావంతో వస్తే, తమ ఉద్యమం మరింత ముందుకు వెళ్తుందని, ప్రభుత్వం ఈ సమస్యను గుర్తిస్తుందని వారు అంటున్నారు. అలా మద్దతు తెలపకుండా ఇక్కడకు వస్తే, అడ్డుకుని తీరుతాం అని వాళ్ళు తేల్చి చెప్పారు. దీంతో మంచి విష్ణు కూడా, ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతాం అని, త్వరలోనే ఇక్కడకు వచ్చి ఉద్యమానికి మద్దతు తెలుపుతాం అని విష్ణు చెప్పారు.