ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగియగానే, చంద్రబాబు, టార్గెట్ మోడీ అంటూ, మోడీ మరోసారి ప్రధాన మంత్రి కాకుండా చెయ్యటానికి, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ చేసిన నమ్మక ద్రోహానికి, బదులు తీర్చే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా, దేశ వ్యాప్త ప్రచారం చేస్తున్నారు. నిన్న కర్ణాటకలో పర్యటించి, ఈ పర్యటనలు మొదలు పెట్టారు. ఈ రోజు చెన్నై వెళ్లారు. అయితే, చంద్రబాబుని ప్రచారానికి పిలిస్తే, ఇబ్బందులు తప్పవనే సంకేతాలు మోడీ ఇస్తున్నారు. తనని ఎండగడుతున్న చంద్రబాబుని ఒంటరి చెయ్యటానికి, వివిధ పార్టీలను బెదిరిస్తున్నారు. చంద్రబాబు మద్దతు తీసుకుంటే ఊరుకునేది లేదని సంకేతాలు ఇస్తున్నారు.
నిన్న చంద్రబాబు జేడీఎస్ తరుపున మండ్యాలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే నిన్న సాయంత్రానికి చంద్రబాబు ఇటు రాగానే, అక్కడ జేడీఎస్ టార్గెట్ గా ఐటి దాడులు జరిగాయి. పోలింగ్ సమీపించిన ప్రస్తుత తరుణంలో జేడీఎస్ నాయకులను మాత్రమే టార్గెట్ గా చేసుకుని ఐటీ దాడులు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. మండ్య, హాసన లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తోన్న దేవేగౌడ ఇద్దరు మనవళ్లు నిఖిల్ గౌడ, ప్రజ్వల్ రేవణ్ణలను ఓడించడానికి, పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఐటీ దాడులు చేస్తున్నారని, దీని వెనుక బీజేపీ హస్తం ఉందని జేడీఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. చంద్రబాబు వచ్చి వెళ్ళిన వెంటనే ఇలా జరగటం గమనార్హం.
అయితే నిన్న జరిగింది నిజమైన దాడులు అనుకున్నా, ఈ రోజు చెన్నై లో అదే జరిగింది. ఈ రోజు డీఎంకే తరుపున చంద్రబాబు ప్రచారం చేసారు. ఆయన అక్కడ నుంచి బయలుదేరగానే, చెన్నైలో డీయంకే టార్గెట్ గా ఐటి దాడులు జరిగాయి. ప్రస్తుతం టీడీపీ, డీఎంకేకు మద్దతిస్తోంది. ఈ రెండు పార్టీలకూ ఉమ్మడి శత్రువుగా బీజేపీ ఉంది. ఏపీలో ఇప్పటికే ఎన్నికల ముందు వరకూ ఇలాంటి చాలా దాడులు జరిగాయి. ఇప్పుడు సరిగ్గా చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలోనే... తమిళనాడులో కూడా దాడులు జరగడంతో... రాజకీయ కలకలం రేగింది. తన ప్రచారంలో బీజేపీపై మండిపడిన చంద్రబాబు... స్వతంత్ర సంస్థల్ని తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటోందని కేంద్రంపై విమర్శలు చేశారు.