మంత్రి నారా లోకేశ్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన లోకేశ్, ఓ హోటల్ వద్ద ప్రసంగిస్తుండగా పై నుంచి హోల్డింగ్ పడింది. అయిదే, ఆ బోర్డు కాస్తా ఆయనకు దూరంగా పడటంతో నేతలు ఎవరూ గాయపడలేదు. మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న టీడీపీ నేత, మంత్రి నారా లోకేశ్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి నిడమర్రులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సద్గుణ టిఫిన్ సెంటర్ వద్ద లోకేశ్ మాట్లాడుతుండగా అక్కడ హోటల్ బోర్డు కుప్పకూలింది. లోకేశ్ సహా మిగిలిన నేతలంతా దానికి దూరంగా ఉండటంతో అది కార్యకర్తల మీద పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమయంలో లోకేశ్‌తోపాటు గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ సహా ముఖ్య నేతలు కూడా ఉన్నారు.

lokesh 20032019 1

అంతకు ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో లోకేశ్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికులతో మమేకమవుతూ ప్రచారం నిర్వహిస్తూ అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాపీ పట్టి భవన నిర్మాణ కార్మికులతో కాసేపు సరదాగా గడిపారు. ఇస్త్రీపెట్టె పట్టుకొని బట్టలు ఇస్త్రీ చేశారు. కూరగాయల మార్కెట్‌లో మహిళలతో ముచ్చటించారు. స్కూల్ విద్యార్థులతోనూ లోకేష్ ముచ్చటించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల లబ్దిపొందిన ఆనందం, సంతృప్తి ఇక్కడ ప్రతి ఒక్కరిలో కనిపించిందంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతకముందు టీడీపీలో చేరిన బ్రాహ్మణ సేవా సమితి సభ్యులకు పసుపు కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజధానికి సమీపంలోని నియోజకవర్గం కావడంతో టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

lokesh 20032019 1

అమెరికాలోని స్టాన్‌ఫర్డు యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన నారా లోకేశ్...దేశానికి తిరిగొచ్చాక కొంతకాలం కుటుంబ వ్యాపారాల్లో తలమునకలయ్యారు. హెరిటేజ్ ఫుడ్స్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన వ్యవహరించారు. 2009 నుంచి నారా లోకేశ్ టీడీపీ వ్యవహారాల్లో తెరవెనుక నుంచి పని మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ 2009 మానిఫాస్టోలో చేర్చిన కాష్ ట్రాన్స్‌ఫర్ స్కీము నారా లోకేశ్ ఐడియాగా టీడీపీ నేతలు చెబుతారు. 2013 మేలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన...తెలుగుదేశం యువజన విభాగానికి నాయకత్వం వహించాడు. పార్టీలో లోకేశ్ ప్రవేశంతో పాటు 2017 మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికై...ఆ తర్వాత కొంతకాలానికే చంద్రబాబు కేబినెట్‌లో చేరారు. ఇప్పుడు లోకేశ్ ప్రజామోదం కోసం ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. మంగళగిరి శాసనసభ నుంచి గెలిచి...నాయకుడిగా తనను నిరూపించుకోవాలని భావిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read