ఎందరో ప్రముఖులను అందించిన విద్యాలయమిది. విద్యావేత్తల నుంచి వ్యాపారవేత్తలు వరకు, సంఘ సంస్కర్తల నుంచి ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు వరకు, కవులు, కళాకరులు వంటి సాహితీ పరిమళాలను అందించిన సరస్వతీ నిలయమిది. ఇంకా చెప్పాలంటే ఉత్తరాంధ్రుల చదువుల తల్లి. సుమారు 163 ఏళ్ల చరిత్రగల ఈ కళాశాల ఖ్యాతి ఖండాంతరాలను తాకింది. మాన్సాస్ (మహారాజా అలక్ నారాయణ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సొసైటీ) ఆధ్వర్యాన నడుస్తున్న కళాశాలలను ప్రయివేటీక రించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాజమాన్యం ఇప్పటికే ఎంఆర్ మహిళా కాలేజీని కో ఎడ్యుకేషన్‌గా మార్చేయగా, తాజాగా ఎంఆర్ కాలేజీని ప్రయివేటీపరం చేసేందుకు శరవేగంగా పావులు కదుపుతున్నారు. . భవిష్యత్తులో మాన్సాస్ విద్యాసంస్థలన్నింటినీ ప్రయివేటీకరించేందుకు ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. దీంతో, డాక్టర్ ఏవిజి రాజు ఆశాలయాలకు తూట్లు పొడుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల ఎంఆర్ కాలేజీలోని అన్ఎయిడెడ్ ఆధ్యాపకులు తమకు వేతనాలు చెల్లించాలంటూ ఆందోళన చేపట్టిన విషయం విధితమే. దీన్ని అవకాశంగా తీసుకున్న మాన్సాస్ చైర్మన్ సంచయిత గజపతిరాజు ఏకంగా ఈ కాలేజీనే ప్రయివేటు పరం చేసేందుకు ఈనెల 10న ప్రభుత్వానికి లేఖరాసినట్టు సమాచారం. అధ్యాపకులకు, సిబ్బందికి వేతనాలు చెల్లించుకోలేక పోతున్నామని, ఫీజులు పెంచితే వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కోవాల్సివస్తుందని, ఈ నేపథ్యంలో కళాశాలను ప్రయివేటీకరిస్తే తప్ప నిర్వహణ సాధ్యమయ్యే పరిస్థితి లేదని విన్నవించినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక కమిషనర్ ఎంఎం నాయక్ కళాశాలలోని మౌలిక సదుపాయాలు, ఆధ్యాపకుల వివరాలు, విద్యార్థుల సంఖ్య, ఫీజులు, నిర్వహణ ఖర్చులు తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక పంపాలంటూ ఈనెల 25న రాజకుమార్ ఉత్తర్వులు పంపారు. విషయం తెలుసుకున్న అధ్యాపకులు ఆందోళన చెందుతున్నాయి. దీని పై స్పందించిన అశోక్ గజపతిరాజు, మాన్సాస్ ట్రస్ట్ ప్రైవేటు ఆస్తి కాదని, ఇలా చేయటం దారుణం అని అన్నారు.