రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, పలు కార్యక్రమాలు చేపట్టేందుకు అమెరికాకు చెందిన వివిధ సంస్థలు ఆసక్తి కనబరిచాయి. సేంద్రీయ వ్యవసాయానికి ‘ఆమ్వే’ సంస్థ ముందుకురాగా, రాష్ట్రంలో ఒక్కో చిన్నారికి రూ. 150కే నిమోనియా వ్యాక్సిన్ వేస్తామని ‘ఫైజర్’ సంస్థ వెల్లడించింది. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ‘భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం’ ప్రతినిధి బృందం సమావేశమైంది. రాష్ట్రంలో తామంతా అడుగుపెట్టేందుకు సిద్ధంగా వున్నామని ఫోరం ప్రతినిధులు ముఖ్యమంత్రికి పలు ప్రతిపాదనలను సమర్పించారు.

రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయం చేపట్టేందుకు ఆయుర్వేద ఉత్పత్తులలో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ‘ఆమ్వే’ సంస్థ తమకు 500 ఎకరాలు కేటాయించాలని ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. ఇప్పటికే తాము కర్నాటకలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నట్టు వివరించారు. కుప్పంలో సేంద్రీయ సాగుపై ముందుగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడి రహిత సేంద్రియ వ్యవసాయానికి కృషి చేస్తున్నామని, ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తున్న సుభాష్ పాలేకర్‌తో కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.

నిమోనియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం రాష్ట్రంలో పెద్దఎత్తున వ్యాక్సినేషన్ వేసేందుకు ‘ఫైజర్’ (Pfizer) సంస్థ సన్నద్ధంగా వుంది. ప్రపంచవ్యాప్తంగా యునిసెఫ్‌తో కలిసి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని ‘ఫైజర్’ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఒక్కో డోసు రూ. 4 వేలు విలువైన వ్యాక్సిన్‌ను రూ. 150కే వేసేందుకు సిద్ధమని అన్నారు. దక్షిణ భారతదేశంలోనే ఎక్కువుగా ఏపీలో నిమోనియా బాధిత చిన్నారులు వున్నందున తక్షణమే వ్యాక్సినేషన్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి చెప్పారు.

హిమోఫీలియా సహా అరుదైన వ్యాధుల నిర్ధారణ పరీక్షా కేంద్రాలను రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నెలకొల్పుతామని ‘షైర్ ఫార్మాస్యుటికల్స్’ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి చెప్పారు. వైద్య రంగానికి అవసరమైన ఐటీ సేవలను అందించేందుకు సిద్ధమని తెలిపారు. రాష్ట్రంలో వైద్యులు తమ విజ్ఞానాన్ని మరింత పెంచుకునేలా అంతర్జాతీయ స్థాయి శిక్షణకు వర్క్‌షాపులను నిర్వహిస్తామని అన్నారు. దేశంలోనే అమరావతిని రణగొణధ్వనులు, ప్రకంపనలు లేని తొలి నగరంగా తీర్చిదిద్దుతామని ‘నాయిస్ కంట్రోల్ సెంటర్’ ఏర్పాటు చేస్తామని ‘వెనెక్లాసెన్’ (Veneklasen) సంస్థ ప్రతినిధులు చెప్పగా, ఆర్గానిక్ ఫ్రూట్ జ్యూసుల తయారీ చేపట్టామని, శ్రీసిటీలో ఉద్యోగులకు గృహ సముదాయల నిర్మాణానికి సిద్ధమని పెప్సికో సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

కోటి ఎకరాల్లో ఉద్యానవనాల పెంపకం చేపట్టి రాష్ట్రాన్ని ప్రపంచానికి హార్టికల్చర్ హబ్‌గా చేయాలని, తద్వారా రైతు ఆదాయాన్ని మూడింతలు చేయాలని సంకల్పించామని ఫోరం ప్రతినిధులతో ముఖ్యమంత్రి అన్నారు. అమరావతిని అంతర్జాతీయ నగరంగా నిర్మించాలనేది తన లక్ష్యమని, ప్రజల్లో 80 సంతృప్తి సాధించాలని నిర్దేశించుకోగా, ఇప్పటికి 58% సంతృప్తిని తీసుకురాగలిగామని చెప్పారు. రియల్ టైమ్ గవర్నెన్స్, ఫైబర్ గ్రిడ్ ఏర్పాటుతో అందరికీ 15 ఎంబీపీఎస్ ఇంటర్‌నెట్, విద్యుత్ రంగంలో సంస్కరణలు తాము సాధించిన విజయాలని చెప్పారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెంచడం, నిల్వ చేయడం ద్వారా విద్యుత్ చార్జీలు తగ్గేలా చూస్తామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం సృష్టించామని, పూర్తి విశ్వాసంతో అడుగుపెట్టొచ్చని భరోసా ఇచ్చారు.

రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రిని ‘భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం’ ప్రతినిధులు కొనియాడారు. అక్టోబర్ 9న న్యూఢిల్లీలో నిర్వహించే ‘రౌండ్ టేబుల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్’కు రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read