ఏడు విడతల్లో సాగుతున్న భారత ఎన్నికల ప్రక్రియ ముగిం పు దశకొచ్చింది. ఇప్పటికే ప్రపంచమంతా లెక్కింపు మీద దృష్టిపెట్టింది. ఈసారి ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. కేవలం దేశీయంగానే కాదు.. అంతర్జా తీయంగా కూడా దీనిపై తర్జన భర్జన పడుతున్నారు. ఇందు క్కార ణం ఆర్థిక, సాంకేతిక రంగాల్లో భారత్ అగ్రదేశాలతో సరిసమా నంగా దూసుకుపోతుండడమే. ఇక్కడ ఏర్పడే ప్రభుత్వాన్ని బట్టి భారత్‌తో వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు ఆధార పడుంటాయి. సహజంగా కౌం టింగ్ ప్రక్రియకు ముందు వెలువడే ఎగ్జిట్‌పోల్స్‌ను ఫలితాలకు ప్రామాణికంగా తీసుకుంటారు. గతంలో పలు సందర్భాల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి దగ్గరగా ప్రతిబింబించాయి. 19న జరిగే చివరిదశ పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. అయితే గతంలోలా ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్‌పై ఎవర్లోనూ ఆసక్తి వెల్లడి కావడం లేదు. ఇందుక్కారణం ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు విశ్వసనీ యతను కోల్పోవడమే.
ఇప్పటికే దేశవ్యాప్తంగా మీడియా సంస్థలన్నీ ఏదొక రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదా ప్రతికూలంగా మారిపోయాయి. ఇవన్నీ తాను మద్దతిస్తున్న పార్టీల రాజకీయ ప్రయోజనాలకు నుగుణంగానే పుంఖాను పుంకాలుగా వార్తలు వెలువరించాయి. వాటికి ఓట్ల శాతాన్ని పెంచే రీతిలోనే కథనాల్ని వండివార్చాయి. వీలు దొరికిన ప్రతి సందర్భంలోనూ ఆ పార్టీని వెనకేసుకొచ్చాయి. ఆ పార్టీల అభ్యర్థుల్ని తమ పాఠకుల మీద బలవంతంగా రుద్దాయి. సదరు పార్టీకే విజయావకాశాలు అధికమంటూ ఊదరగొట్టాయి. అటువైపు ఓటర్ల దృష్టిని మరల్చే ప్రయత్నం చేశాయి. పోలింగ్ ప్రక్రియ అనంతరం కూడా తాము మద్దతిచ్చిన పార్టీయే అధి కారంలోకి రాబోతుందంటూ ముందస్తు సర్వేల పేరిట కథనాలు వెలువరిస్తున్నాయి. ఓటర్లు కూడా గతంతో పోలిస్తే రాటుదేలారు.
మీడియా నైజాన్ని వారూ ఒంటబట్టించుకున్నారు. ఏ పత్రిక లేదా చానల్ ఎవరి తరపున పని చేస్తున్నాయో గుర్తించేశారు. దీంతో మీడియా సంస్థలు వెలువరించనున్న ఎగ్జిట్ పోల్స్‌కు విశ్వసనీయత కొరవడింది. ఇవి ఏమాత్రం ప్రామాణికాల్ని పాటించడం లేదని ప్రజలు అవగాహనకొచ్చేశారు. దీంతో వీటి విశ్లేషణలు వెల్లడించే ఫలితాలెలా ఉన్నా 23వ తేదీన ఈవీఎంలు తెరిచి కౌంటింగ్ పూర్తయి ఫలితాలు వెల్లడయ్యే వరకు విజేతలు ఎవరన్న దానిపై అవగాహనకు రాకూడదని నిర్ణయించుకున్నారు. జాతీయ స్థాయిలో వెలువడే ఛానల్స్, పత్రికలు, కొన్ని అంతర్జాతీయ సర్వే సంస్థలతో కలిపి నిర్వహించి ఎన్నికలకు ముందే విడుదల చేసిన కొన్ని అంచనాల మధ్య తీవ్ర వ్యత్యాసాలుండడం కూడా వీటిపై విశ్వసనీయత కొరవడ్డానికో కారణమైంది. ఒకే సంస్థ వెలువరించిన పలు అంచనాల్లో భారీ తేడాలుండడం ప్రజల్లో ఆలోచన రేకెత్తించింది. ఇలాంటి వ్యత్యాసాలే ఇప్పుడు ముందస్తు సర్వే ఫలితాలపై జనంలో విశ్వాసాన్ని కోల్పోయేట్టుగా చేశాయి. దీంతో ఈ నెల 19వ తేదీ సాయంత్రం ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెలువడ్డా ఆఖరి ఈవీఎం తెరిచి ఫలితాలు ప్రకటించే వరకు కూడా ప్రజలు గెలుపోటముల్ని నిర్ధారించేందుకు సిద్దంగా కనిపించడం లేదు.