మోదీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఎన్డీయేతర పక్షాలను ఏకతాటిపైకి తేవడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు సానుకూల దిశలో సాగుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత అందరూ ఒక్కతాటిపై నడవాలన్న ఆయన ప్రతిపాదనను రాహుల్‌గాంధీ, మాయావతి, అఖిలేష్‌యాదవ్‌, శరద్‌పవార్‌లు అంగీకరించినట్లు తెలిసింది. రాహుల్‌గాంధీ ‘ఉయ్‌ ఆర్‌ వన్‌’ అని చెప్పగా, మాయావతి మీరు పెద్దన్నయ్య పాత్ర పోషించి అందర్నీ కలిపే బాధ్యతను భుజానకెత్తుకోవాలని సూచించినట్లు సమాచారం. శుక్రవారం దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం తీరిక లేకుండా చర్చల్లో మునిగారు. ఉదయం దిల్లీలో రాహుల్‌గాంధీతో, సాయంత్రం ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌లతో కీలక సమాలోచనలు చేశారు.

mayawati 19052019

అంతకు ముందు దిల్లీలో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఎంపీ డి.రాజా, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, ఎల్‌జేడీ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ నెల 23వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే నాటికి ఎన్డీయేతర కూటమి, దాని నాయకత్వానికి ఒక స్పష్టమైన రూపు తీసుకురావాలన్న కృతనిశ్చయంతో ఉన్న చంద్రబాబునాయుడు దానిపై అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కూటమిలో కీలక భూమిక నిర్వహించబోయేందుకు అవకాశం ఉన్న పార్టీ అధినేతల అభిప్రాయాల ఆధారంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలన్న భావనతో ఆయన కార్యాచరణ మొదలుపెట్టారు. ఉదయం రాహుల్‌గాంధీతో సమావేశమైనప్పుడు ఆయన ‘ఉయ్‌ ఆర్‌ వన్‌ (మనం అంతా ఒక్కటే)’ అన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దాన్నిబట్టి చంద్రబాబు జరిపే సమావేశాలు, వాటి ఆధారంగా తీసుకొనే నిర్ణయాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందనే భావనను రాహుల్‌ వ్యక్తం చేసినట్టయ్యిందన్న అభిప్రాయం తెదేపాలో వ్యక్తమవుతోంది.

mayawati 19052019

మధ్యాహ్నం 2.30 గంటలకు లఖ్‌నవూ బయలుదేరి వెళ్లి తొలుత ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, తర్వాత బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని కలిశారు. 23వ తేదీ ఫలితాల తర్వాత వారు ఏం చేయాలనుకుంటున్నారు? జాతీయ రాజకీయాల్లో ఏ పాత్ర పోషించాలనుకుంటున్నారు? అన్న అభిప్రాయాలను చంద్రబాబువారి నుంచి రాబట్టే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ప్రస్తుత పరిణామాలను బట్టిచూస్తే అఖిలేష్‌యాదవ్‌ యూపీ రాజకీయాలపైనే ప్రధానంగా దృష్టిసారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మాయావతి మాత్రం జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడానికి సిద్ధమయ్యారు. అందువల్ల ఆమె మనోభావాలను కూలంకషంగా తెలుసుకొని వాటిని రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌లాంటి వారితో పంచుకుని తదనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెదేపా వర్గాలు పేర్కొన్నాయి. దీనితో చంద్రబాబు శనివారం రాత్రికి విజయవాడ వెళ్లాల్సి ఉన్నా దాన్ని మానుకొని తిరిగి దిల్లీకి చేరుకున్నారు. ఆదివారం ఆయన మరోసారి రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌లతో సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అఖిలేష్‌, మాయావతిలతో జరిపిన చర్చల సారాంశాన్ని వారికి చెప్పి స్పష్టమైన వైఖరికి వచ్చిన తర్వాత మిగతా అన్ని మిత్రపక్షాలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయొచ్చని తెదేపా వర్గాలు అభిప్రాయపడ్డాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read