ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, చంద్రబాబు పార్టీ పై సమీక్షలు చేస్తున్నారు. రోజుకి ఒక జిల్లా చొప్పున, సమీక్ష చేస్తున్నారు. ఈ సమావేశాల్లో, పార్టీకి నష్టం చేకురుస్తున్న నాయకులకు చెమటలు పట్టిస్తున్నారు. అవినీతి ఆరోపణలు, పనితీరులో తేడా, అలసత్వం, ఇలా ఎమ్మెల్యేల జాతకాలను అన్ని కోణాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు బయటకు తీస్తున్నారు. ఆరోపణల చిట్టాను వారి చేతికే అందించి... దీనికి ఏమిటి మీ సమాధానమని నిలదీస్తున్నారు. తప్పులు దిద్దుకొని ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోకపోతే దెబ్బతింటారని, ఆ తర్వాత తనను అనుకొని ప్రయోజనం లేదని గట్టిగా హెచ్చరిస్తున్నారు. మూడో మనిషి లేకుండా... ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులతో వ్యక్తిగతంగా భేటీ అయ్యి చర్చిస్తున్నారు. ఈ సమయంలో ఆ నేతకు సంబంధించి పార్టీలో అంతర్గతంగా ఉన్న నివేదికలు, పనితీరుపై పార్టీ వర్గాలు, ప్రజల్లో వ్యక్తమైన అభిప్రాయాలు, సర్వేల ఫలితాలను ముందుంచుకుని మరీ మాట్లాడుతున్నారు
రాయలసీమలోని ఒక జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ‘నీరు - చెట్టు’ పనులను తమ అనుచరులతో చేయిస్తూ భారీగా గడించారని, ఖరీదైన కార్లు కొనుక్కొని తిరుగుతున్నారని పార్టీ అధిష్ఠానానికి సమాచారం అందింది. ఈ భేటీల్లో చంద్రబాబు ఆ ఇద్దరినీ దీనిపై ప్రశ్నించారు. అవన్నీ ప్రతిపక్షాల ప్రచారమని వారిద్దరూ షరా మామూలుగా బదులిచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో చంద్రబాబు ఒకింత కరుకుగానే మాట్లాడారని సమాచారం. ‘‘ఏం జరుగుతోందో నాకు తెలుసు. ప్రజలు ఒక విశ్వాసంతో మిమ్మల్ని గెలిపించారు. దానిని నిలుపుకోండి. సంపాదనలో పడి పార్టీకి మీరు బరువుగా మారితే మిమ్మల్ని మోసుకొంటూ తిరగాల్సిన అవసరం పార్టీకి లేదు. మిమ్మల్ని మీరు దిద్దుకోండి. ప్రజలకు సన్నిహితంగా ఉండి మంచి పేరు తెచ్చుకోండి. రాజకీయాల్లో దీర్ఘకాలం నిలబడగలిగేలా మీ పనితీరు ఉండాలి. ఒక్కసారితో పోయేవారి జాబితాలో చేరకండి’’ అని ఆయన వారికి క్లాస్ పీకారు.
ఇకపై ఇటువంటి ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా చూసుకొంటామని వారు ఆయనకు హామీ ఇచ్చారు. తాను ప్రతి నెలా సర్వేలు చేయిస్తున్నానని, వాటిలో పనితీరు మెరుగుపడకపోతే తర్వాత తన చేతిలో కూడా ఏమీ ఉండదని ఆయన వారికి తేల్చిచెప్పారు. ముఖాముఖి భేటీల్లో ఆరోపణల చిట్టాలను ముఖ్యమంత్రి బయట పెడుతున్న విషయం ప్రచారంలోకి రావడంతో ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ముఖాముఖి ముగించుకున్న నేతల్లో తమ మిత్రులైన వారికి ఫోన్లు చేసి ఏం జరిగిందో తెలుసుకొంటున్నారు.