ఇరు తెలుగు రాష్ట్రాలకి తెలిసిన ప్రముఖ కాంట్రాక్టర్‌ మేఘా కృష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో గత మూడు రోజులుగా ఐటి సోదాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. భారీగా అక్రమాలు చేసారనే అనుమానాలు రావడంతోనే ఐటి అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఐటి సోదాలు పూర్తిగా ఢిల్లీ నుంచి వచ్చిన ఐటి బృందాల ఆధీనంలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఢిల్లీ అధికారులు హైదరాబాద్‌ చేరుకున్న తరువాతే సోదాల విషయమై హైదరాబాద్ లో ఉన్న అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దగ్గరి సంబంధాలు ఉండటంతోనే, ఐటి అధికారులు వచ్చే దాకా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు ఐటి వర్గాలు చెబుతున్నాయి. మేఘా కంపెనీ చేపట్టిన కాంట్రాక్టులు, రెండు ప్రభుత్వాల నుంచి వచ్చిన కాంట్రాక్టుల్లో ఉన్న బిల్లుల వివరాలు తెలుసుకుని మరీ ఐటి రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది.

megha 13102019 2

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ కాంట్రాక్టు పనులు దక్కించుకున్న మేఘా కంపెనీ, ఇతర చోట్ల కూడా కొన్ని కాంట్రాక్టు పనులు దక్కించుకుంది. ఫోర్బ్స్ మాగజైన్ ప్రచురించే కుబేరుల్లో ఒకరుగా మేఘా ఎదిగారు. అయితే, అతి తక్కువగాబ ఈ కంపెనీ, ముందస్తు పన్నులు చెల్లించింది. భారీ కాంట్రాక్టులు చేస్తున్న ఈ కంపెనీ ఇంత తక్కువగా ఎలా పన్నులు చెల్లిస్తుందనే అనుమానాలతో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో, పలు కీలక లావాదేవీల ఆధారాలు దొరకడంతో పూర్తి సమాచారం తెప్పించుకునే పనిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మీడియా సంస్థలు, ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ కంపెనీల్లో మేఘా కష్ణారెడ్డి పెట్టుబడులు పెట్టారు. టివి 9 కొనుగోలు వ్యవహారం, పోలవరం రివర్స్‌ టెండర్లు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. వీటి లావాదేవీలపైనా ఐటి అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

megha 13102019 3

మేఘా ఇంటి నుంచి పలు కీలక డాక్యుమెంట్లు, ల్యాప్ టాప్ తదితర వస్తువులను అధికారులు బయటకు తీసుకు వెళ్లారు. ఇక మరో పక్క, ఐటి సోదాల్లో హవాలా రూపంలో వచ్చిన డబ్బులతో లావాదేవీలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తుండటంతో, రేపు ఈడీ కూడా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇక మరో పక్క, ఈ ఐటి దాడులు జరుగుతున్న సమయంలోనే తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి, మేఘా కృష్ణారెడ్డి ఇంటికి రావడం సంచలనంగా మారింది. మీడియాకు కనపడకుండా మంత్రి జాగ్రత్త పడినా, మీడియా కవర్ చేసింది. ఇక మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా, అక్కడే మకాం వేసారు. కృష్ణారెడ్డి ఇంటి పక్కనే మకాం వేసి, ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితి, జరుగుతున్న విషయాల పై ఆరా తీసినట్లు తెలిసింది. మేఘా కృష్ణారెడ్డి ఇంటి వద్ద కేంద్ర బలగాలు మోహరించడం విశేషం. తెలంగాణా రాష్ట్ర పోలీసులను సైతం మేఘా ఇంట్లోకి అనుమతించలేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read