మార్గం ఏదైతేనేమీ ప్రత్యర్థిని ఓడించడమే లక్ష్యంగా ఫామ్-7 అస్త్రాన్ని ఎంచుకున్న వైసీపీ కుట్రలను పోలీసులు ఛేదిస్తున్నారు. మొత్తం 376 కేసుల్లో ఇప్పటి వరకూ 2,288 మందిని గుర్తించిన పోలీసులు వారిలో ఎక్కువ మందిని విచారించారు. అందులో 83శాతం మంది జగన్ పార్టీ సానుభూతిపరులు, వైసీపీ కార్యాలయంలో పనిచేసే వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. సీడాక్ నుంచి ఐపీ అడ్ర్‌సల వివరాలు అందగానే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ నుంచి మంత్రి పరిటాల సునీత వరకూ మంత్రులు, పలువురు కీలక టీడీపీ నేతలను వైసీపీ లక్ష్యంగా చేసుకుంది. సీఎం చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లెకు సంబంధించిన చంద్రగిరి నియోజకవర్గంలో 19,225 దరఖాస్తులు అందితే విచారణలో తొలగించింది 8 మాత్రమే.
కళా వెంకట్రావు నియోజకవర్గమైన ఎచ్చెర్లలో 6,363 ఓటర్లను తొలగించాలంటూ ఫామ్-7 దరఖాస్తులు అందగా విచారణలో తొలగింపునకు అర్హమైనవి రెండు మాత్రమే. ఇంకా 16 విచారణలో ఉన్నాయి. అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత నియోజకవర్గం రాప్తాడులో 9,748 వస్తే అనర్హులంటూ తొలగించింది కేవలం ముగ్గురినే. విజయనగరం జిల్లాలో మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న బొబ్బిలిలో 5,904 దరఖాస్తులు వస్తే తొలగించింది ఐదు మాత్రమే. విశాఖపట్నం జిల్లాలో మంత్రి గంటా శ్రీనివాసరావును లక్ష్యంగా చేసుకుని భీమిలిలో 7,815 ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు పెట్టిన వ్యక్తులు 101 మాత్రమే అర్హులపేర్లు పెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో స్వతంత్ర ఎమ్మెల్యే వర్మను సైతం ప్రత్యర్థులు వదల్లేదు.
ఆయన ప్రాతినిధం వహిస్తోన్న పిఠాపురంలో 5,231 ఓట్లు తొలగించేందుకు దరఖాస్తులు అందితే వాటిలో 127 మాత్రమే అర్హతగలవి. మైలవరంలో మంత్రి ఉమామహేశ్వరరావును దెబ్బ కొట్టేందుకు ప్రత్యర్థులు 6,334 ఓట్ల తొలగింపునకు వేసిన ఎత్తుగడ తిరగబడింది. మొత్తం విచారణ అనంతరం కేవలం 126 ఆమోదించారు. గుంటూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరుల ఓట్లు తొలగించేందుకు 7,859 దరఖాస్తులు వస్తే గురజాలలో తొలగించింది 239 మాత్రమే. అనంతపురం జిల్లా ధర్మవరంలో 6వేలకుపైగా వచ్చిన దరఖాస్తుల్లో 1100 తొలగించారు. వీటితోపాటు రాజాం, ఆముదాలవలస, చీపురుపల్లి, అనకాపల్లి, అనపర్తి, భీమవరం, చింతలపూడి, మార్కాపురంలలో వేలల్లో ఫామ్-7 దరఖాస్తులు అందగా వందల్లోనే తొలగించినట్లు తెలిసింది.