జమ్మలమడుగు నియోజకవర్గంలోని చదిపిరాళ్ల శివనాథరెడ్డిని శాసనమండలి సభ్యుడిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు. గవర్నర్‌ కోటాలో ఈ నియామకం రెండు రోజుల్లో పూర్తి కానున్నది. జమ్మలమడుగు టీడీపీ టికెట్‌ ఖరారు విషయంలో జరిగిన ఒప్పందం మేరకు రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థానాన్ని మంత్రి ఆది కుటుంబ సభ్యులకు ఇవ్వాలనే నిర్ణయం మేరకు శివనాథరెడ్డి పేరును ఖరారు చేశారు. 2014 ఎన్నికల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గెలుపొందిన ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరడం, ఆ వెంటనే అమాత్య పదవి వరించింది. మొదటి నుంచి టీడీపీలో కొనసాగుతున్న రామసుబ్బారెడ్డి దీనిని వ్యతిరేకించడంతో ఆయనను శాంతింపజేస్తూ గవర్నర్‌ కోటాలో 2017 జూన్‌ 26న ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

mlc 01032019

జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్‌పై మంత్రి ఆది, రామసుబ్బారెడ్డిలు పట్టుబడడంతో రాజీ ఫార్ములా తీసుకొచ్చిన అధినేత చంద్రబాబు ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎంపీగా పోటీ చేయాలని కోరారు. ఎంపీగా పోటీ చేయాలంటే తమ కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ మంత్రి ఆది కుటుంబ సభ్యులు కోరారు. ఈ ఒప్పందం మేరకు ఈనెల 9న శాసనమండలి సభ్యత్వానికి రామసుబ్బారెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసే సమయానికి పంతొమ్మిదినెలల పాటే ఎమ్మెల్సీగా కొనసాగారు. ఇంకా నాలుగు సంవత్సరాల మూడు నెలలు ఈ ఎమ్మెల్సీ పదవీ కాలం ఉంది. మంత్రి ఆది కుటుంబ సభ్యులు చర్చించుకుని మంత్రి ఆది చిన్నాన్న శంకర్‌రెడ్డి కుమారుడు శివనాథరెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.

mlc 01032019

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో ఐదు స్థానాలు ఎమ్మెల్యే కోటాలోవి కాగా, ఒకటి వైసీపీకి పోను, నాలుగు టీడీపీకి దక్కుతాయి. గవర్నర్‌ కోటాలో 2, విశాఖ స్థానిక సంస్థల కోటాలో ఒకటి మొత్తం ఏడు స్థానాలకు టీడీపీ అభ్యర్థులు ఎంపిక చేయాల్సి ఉంది. బుధవారం రాత్రి ఈ ఏడు స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. నిన్నటి వరకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న రామసుబ్బారెడ్డి రాజీనామా చేసిన స్థానాన్ని మంత్రి ఆది కుటుంబ సభ్యులకు ఒప్పందం మేరకు కేటాయించాల్సి ఉండడంతో నారాయణరెడ్డి కుమారుడు శివనాథరెడ్డికి అవకాశమిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. గవర్నర్‌ కోటాలో కేటాయింపు కావడంతో నామినేషన్‌ వేయాల్సిన అవసరం లేదు. ఒకటి, రెండు రోజుల్లో గవర్నర్‌ కోటా భర్తీ చేస్తూ అధికారిక ఆదేశాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్సీగా అధినేత చంద్రబాబు ఎంపిక చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని శివనాథరెడ్డి తెలిపారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read