రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై గత మూడు రోజులుగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. బుధవారం మరో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. రైతు సంక్షేమంపై విడుదల చేసిన ఈ శ్వేతపత్రంలో రాష్ట్రంలో రైతులు, వ్యవసాయం అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులను రుణవిముక్తి చేయాలని సంకల్పించామని.. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేశామని చంద్రబాబు చెప్పారు. ధనిక రాష్ట్రాలు కూడా చేయని విధంగా రూ.1.50లక్షల వరకు రుణాలను మాఫీ చేశామన్నారు. తెదేపా ప్రభుత్వం అధికారంలో వచ్చాక 62 ప్రాజెక్టులు చేపట్టగా వాటిలో 17 పూర్తి చేశామని, మరో 6 ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మిగతా ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పారు. పట్టిసీమతో కృష్ణా డెల్టా సస్యశ్యామలమైందని, పట్టిసీమ నీళ్లు శ్రీశైలానికి మళ్లించి అక్కడి నుంచి రాయలసీమకు తీసుకెళ్లామని.. వర్షాలు పడకపోయినా ఇబ్బందిలేని విధంగా చేశామని చెప్పారు.
రాష్ట్రంలో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎన్నికల ప్రచారం సమయంలో ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానని చంద్రబాబు తెలిపారు. ప్రచారంలో రైతు రుణమాఫీపై హామీ ఇవ్వాలని మోదీని అప్పుడు కోరానని, దేశవ్యాప్తంగా చేయాల్సి వస్తుందని ఆయన పట్టించుకోలేదని చంద్రబాబు అన్నారు. కాని ఇప్పుడు మాత్రం, రైతులని పట్టించోకుండా, కార్పొరేట్ వ్యక్తులకు రుణాలు మాఫీలు చేస్తున్నారని అన్నారు. 2014లో ఏపీలో ఆత్మహత్యలు, కరెంట్ కోతలతో రైతులు అల్లాడేవారనీ, చివరికి కోనసీమ వాసులు కూడా ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. గత 20 ఏళ్లలో 16 సంవత్సరాలు అనంతపురం జిల్లాలో కరవు విలయతాండవం చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇవన్నీ ఆ రోజు మోడీకి చెప్పి, మేం రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పాం. మీరూ ఓ మాట చెప్పండి’ అని తాను కోరాననీ, ఇందుకు ప్రతిగా ‘నేను చెప్పను. ఒకవేళ ఇక్కడ చెబితే దేశమంతా అమలు చేయాల్సి ఉంటుంది’ అని మొహం మీదే చెప్పారని, ఇప్పుడు కార్పొరేట్ లకు మాఫీలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఆక్వా రంగానికి పెద్దపీట వేశామని, ఉద్యాన పంటలను ప్రోత్సహించామని చంద్రబాబు చెప్పారు. దేశంలో రెండంకెల వృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే అన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకలో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు నమోదవుతున్నాయని, ఏపీలో ఆత్మహత్యలు గణనీయంగా తగ్గించగలిగామన్నారు. ఈ నాలుగుళ్ల కాలంలో వ్యవసాయానికి రూ.2.52 లక్షల కోట్లు కోట్లు ఖర్చుపెట్టామన్నారు. దేశంలో వ్యవసాయానికి అత్యధికంగా ఖర్చు చేసింది ఏపీ ప్రభుత్వమేనని చెప్పారు. నదుల అనుసంధానంతో గోదావరి నీళ్లు కృష్ణాకు తెచ్చామన్నారు. తక్కువ పెట్టుబడితో రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టామని చంద్రబాబు వివరించారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే మిగతా రంగాలూ అభివృద్ధి చెందుతాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేదని విధంగా కౌలు రైతులకు రూ.9,411 కోట్లు ఇచ్చామన్నారు. దీంతో 25లక్షల మంది కౌలురైతులకు మేలు చేకూర్చామని సీఎం తెలిపారు.