5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై భాజపా అగ్ర నాయకద్వయం మాట్లాడకపోవడం ఆ పార్టీ నాయకులను ఆశ్చర్యపరిచింది. గురువారం పార్లమెంటు గ్రంథాలయ భవనంలో జరిగిన ఎంపీల సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ గానీ, అధ్యక్షుడు అమిత్ షా గానీ ఎన్నికల అంశాన్ని అసలు ప్రస్తావించలేదు. సుదీర్ఘ ప్రసంగం చేసిన మోదీ అధికభాగం దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయీకి నివాళులు అర్పించడానికే కేటాయించారు. ఎన్నికల పరాజయంపై ఒక్క మాటైనా మాట్లాడకపోవడం ఆశ్చర్యపరిచిందని పలువురు ఎంపీలు వ్యాఖ్యానించారు. మరో నాలుగు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ప్రస్తుత ఫలితాలపై వ్యాఖ్యానించి విలువైన సూచనలు, సలహాలు ఇస్తారని భావిస్తే అసలు దానిపైన ప్రస్తావనే లేదని అన్నారు. ఏమీ చెప్పకుండా దాటవేతకు కారణం ఏమిటా అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
పార్టీ ప్రధాన కార్యాలయంలో 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల పదాదికారుల సమావేశంలో కూడా అధ్యక్షుడు అమిత్ షా ఓటమిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పోలింగ్ బూత్ స్థాయిలో కార్యక్రమాల నిర్వహణపై సూచనలు ఇచ్చారు. ఓటర్లతో అనుసంధానమయ్యేలా క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఆధునిక సాంకేతిక పరికరాలను అందివ్వాలని సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్ నాయకులతో మాట్లాడి ఓటమిపై నివేదికలు ఇవ్వాలని ఎన్నికలు జరిగిన అయిదు రాష్ట్రాల పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శులను అమిత్ షా కోరినట్టు తెలిసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ఓటమికి వేరువేరు కారణాలు ఉన్నాయని, వాటన్నింటినీ ప్రస్తుతం ఈ సమావేశంలో చర్చించడం సరికాదని అన్నట్టు తెలిసింది.
అయితే ఈ రోజు మాత్రం, అమిత్ షా ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్నారు. దీనికి కారణం రాఫల్ పై కోర్ట్ ఇచ్చిన తీర్పు. రఫేల్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, వీటిపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయస్థానం ఈ రోజు తోసిపుచ్చింది. దేశ భద్రత దృష్ట్యా కొన్ని అంశాల్లో గోప్యత పాటించాల్సి వస్తుందని కోర్టు పేర్కొంది. రఫేల్ ఒప్పంద నిర్ణయ విధానం, ధరల వ్యవహారం, అంతర్జాతీయ ఒప్పందం వంటి అంశాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు కన్పించట్లేదని కోర్టు తెలిపింది. అయితే కోర్ట్ తీర్పు ఇచ్చిన వెంటనే అమిత్ షా ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధిని తిట్టారు. అయితే 5 రాష్ట్రాల్లో ఓటమికి బాధ్యత తీసుకొని పార్టీ అధ్యక్షుడు, కోర్ట్ తీర్పు పై వెంటనే ప్రెస్ మీట్ పెట్టటం విశేషం.