సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రచారంలో కాంగ్రెస్ పార్టీతోపాటు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ప్రతాప్‌గఢ్ సభలో మోదీ మాట్లాడుతూ.. రాజీవ్ జీవితం అవినీతి నెం.1గా ముగిసిపోయిందని వ్యాఖ్యానించారు. గురువారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్‌పై విమర్శలు గుప్పించడమే కాదు, దళితుడైన ఉమ్మడి ఏపీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్యను రాజీవ్ ఘోరంగా అవమానించారని విమర్శించారు. మోదీ వ్యాఖ్యలపై అంజయ్య మనవడు, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ సెక్రెటరీ అభిషేక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అంజయ్యను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదేపదే ‘దళితుడు’ అని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అభిషేక్‌రెడ్డి తెలిపారు.
దళితుడు అయినందుకే అంజయ్యను నాటి ప్రధాని రాజీవ్ విమానాశ్రయంలో అవమానించారని పార్లమెంటు సాక్షిగా మోదీ వ్యాఖ్యానించారని, తాజాగా గురువారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ప్రస్తావించారని తెలిపారు. న్నికల్లో దళితుల ఓట్లు పొందడానికే మోదీ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వాస్తవానికి అంజయ్య అసలు పేరు రామకృష్ణారెడ్డి అని, దళితుడు కాదని పలుమార్లు వివరణ ఇచ్చినా..ప్రధాని ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. అంజయ్యను రాజీవ్‌గాంధీ ఎయిర్ పోర్టులో అవమానించలేదని, ప్రధాని పదవిలో ఉండి ప్రజలకు తప్పుడు సమాచారం అందజేస్తున్నారని విమర్శించారు. దీనిపై అన్ని వివరాలతో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని అభిషేక్‌రెడ్డి వివరించారు.
అంజయ్య అసలు పేరు రామకృష్ణారెడ్డి అని, ఆయన ఓసీ అని అంజయ్య మనుమడు అభిషేక్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు గాను పూర్తి వివరాలతో కూడిన ఒక నోట్‌ను త్వరలోనే ప్రధాని మోదీకి పంపుతామని ఆయన తెలిపారు. ఆయన ఓసీ అయినప్పటికీ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడ్డారని, పేదల పక్షపాతిగా ఉన్నందుకే అంజయ్యను అందరూ దళితడనుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ఏ ఒక్క వర్గానికీ చెందిన వారు కాదని, అన్ని వర్గాల నాయకుడని తెలిపారు. అంజయ్య కులం విషయంలో తాము ఇప్పటికే బీజేపీ నాయకులకు వివరణ ఇచ్చామని అయినా వారు అలాగే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రధాని మోదీ తన వైఖరికి మార్చుకోకపోతే కేసు వేస్తామని ఆయన హెచ్చరించారు. మరోవైపు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అంజయ్యను అవమానపరిచారనడం పూర్తి అవాస్తవమని అభిషేక్ కొట్టిపారేశారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇలా వ్యవహరిస్తున్నారని అభిషేక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.