గత ఐదేళ్ల పాలనలో మీరేం చేశారో, నేనేం చేశానో చర్చిద్దాం.. దమ్ముంటే రండి అంటూ తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోడీకి సవాల్ విసిరారు. రాష్ట్రానికి మోడీ చేసిందేమీలేదని, విశాఖకు రైల్వే జోన్ ఇచ్చినా అది తల లేని మొండెంతో సమానమని చంద్రబాబు అన్నారు. రైల్వే ఆదాయం అంతా రాయ్ గఢ్ కు వెళుతుందని, విశాఖకు రైల్వే జోన్ ఉన్నా.. ప్రయోజనం లేని పరిస్థితి సృష్టించారని మోడీపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదని, పోలవరానికి నిధులు ఇవ్వలేదని అన్నారు. అన్ని విధాలా రాష్ట్రప్రజలను మోసం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ అని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కియా మోటార్స్ రాకుండా మోడీ విశ్వప్రయత్నాలు చేశారని, గుజరాత్ కు గద్దలాగా తన్నుకుపోవాలని చూశాడని ఆరోపించారు. ఇప్పుడు కోడికత్తి పార్టీ కియా మోటార్స్ ను ఏపీకి తెచ్చింది మోడీయేనని చెబుతోందని, కనీసం కోడికత్తి పార్టీకైనా అలా చెప్పేందుకు సభ్యత ఉండాలి కదా అని చంద్రబాబు విమర్శించారు. మోడీ ఏ పనీ చేయకపోయినా కోడికత్తి పార్టీ సిగ్గులేకుండా ఆయనకు కితాబిస్తోందంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నేతలు చెల్లని కాసులని చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రమంతా తెదేపా తుపాను గాలిలా వీస్తోందన్నారు. తెదేపా గాలిని ఎవరూ అడ్డుకోలేరన్నారు. త్వరలో ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు ఇస్తామన్నారు. పేదవారి పేరుతో బకాయిలు ఉండటానికి వీళ్లేదన్నారు. ప్రతి పేద వారి బకాయిలు అన్నీ రద్దు చేస్తానన్నారు. మన పాలనలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారన్నారు. రాష్ట్రానికి అన్నం పెట్టే రైతులకు అండగా ఉంటానని చంద్రబాబు నాయుడు అన్నారు. రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క రైతును ఆదుకుంటున్నామన్నారు. రైతు రుణాలు మాఫీ చేశామన్నారు. రైతులు ఆనందంగా ఉండేందుకు ఏమైనా చేస్తామన్నారు. వృద్దులు తనను వారి పెద్దకొడుకుగా భావిస్తున్నారన్నారు. ఇప్పుడు ఇస్తున్న రూ.2వేల పింఛన్ ను రూ.3వేలకు పెంచుతానన్నారు. అన్న క్యాంటీన్ లతో రూ.5లకే నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు.
బీసీలకు అండగా ఉన్న పార్టీ టీడీపీ అని చంద్రబాబునాయుడు అన్నారు. కియా మోటార్స్ ను గుజరాత్ తీసుకెళ్లేందుకు మోడీ యత్నించారన్నారు. మోడీతో పోరాడి అనంతపురం జిల్లాకు కియా మోటార్స్ ను తీసుకొచ్చామన్నారు. కియా మోటార్స్ తెచ్చినట్లు మోడీ చెప్పుకోలేకపోయారన్నారు. తన హయాంలోనే హైదరాబాద్ ను అభివృద్ది జరిగిందని అన్నారు. బంగారు గుడ్డుపెట్టే బాతు లాంటి హైదరాబాద్ ను మన రాష్ట్రానికి వచ్చామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేసి నెంబర్ వన్ స్థానంలో నిలుపుతానన్నారు. అయితే రాష్ట్రంలో వైసీపీ, కేంద్రంలోని బీజేపీలు అభివృద్దికి అడ్డుపడ్డాయన్నారు. మన రాష్ట్రం అభివృద్ది చెందకూడదని కుట్రలు పన్నారన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. మోడీ, కేసీఆర్ బెదిరిస్తే నేను భయపడతానా అని చంద్రబాబు అన్నారు. అమరావతిని అడ్డుకునేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారన్నారు. ఏపీకి ఇవ్వాల్సిన రూ.లక్ష కోట్లు కేసీఆర్ ఇవ్వడం లేదన్నారు.