భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు నరేంద్ర మోదీనే. అలాంటి మోదీ ప్రచారాస్త్రం కాంగ్రెస్‌ను కవ్వించడం.. వివిధ వర్గాలను రెచ్చగొట్టడం. మొదటి విడత నుంచి చివరి వరకూ అదే జరుగుతుంది. కాంగ్రెస్ సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను అవమానించింది.. ఇది గుజరాత్‌లో నరేంద్ర మోదీ ప్రచారాస్త్రం. రాజీవ్ గాంధీ దళితుడైన అంజయ్యను అవమానించారు.. ఇది తెలంగాణలో మోదీ డైలాగ్. పీవీ నరసింహారావును కాంగ్రెస్ అగౌరవపరిచింది.. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా మోదీ చెప్పే మాట. ఇలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆ రాష్ట్రానికి చెందిన పాత తరం ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు చెప్పి కాంగ్రెస్ అవమానించిందంటారు. ఒకవేళ అక్కడ కాంగ్రెస్ లేకపోతే.. అక్కడ ఉండే ప్రాంతీయ పార్టీలను కలిపి విమర్శలు చేస్తున్నారు. ఇలా చేసే విమర్శల కోణంలోనూ ఓ లెక్క ఉంటుంది. ప్రభావవంతమైన వర్గం ఓటర్లను మోదీ టార్గెట్ చేసుకుంటారు. అందరినీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం చేసేందుకు ఆ ఆరోపణలు చేస్తారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీ ఆ నేతలను అవమానించిందా? అంటే వారంతా కాంగ్రెస్ పార్టీలో దిగువ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన నేతలు. చివరికి వల్లభాయ్ పటేల్‌ను మహాత్ముని కన్నా ఎక్కువగా అభిమానిస్తున్న బీజేపీ.. ఆ నాయకుడు తమ సిద్ధాంత సంస్థ ఆర్ఎస్ఎస్‌ను నిషేధించారన్న సంగతిని ఎవరికీ చెప్పలేదు. పటేల్ అంటే బీజేపీ నేత అన్నట్లుగా చెప్పుకొస్తారు. ఇక అంజయ్య ముఖ్యమంత్రి అయినా.. పీవీ నరసింహారావు ప్రధాన మంత్రి అయినా.. కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్లే అయ్యారు. వారికి అంతటి గౌరవం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వారిని ఎలా అవమానించిందో మాత్రం విపులంగా చెప్పలేదు. చిన్న చిన్న ఘటనలను చిలువలు పలువలుగా చెప్పి మోదీ రాజకీయ ప్రసంగాలు చేసేస్తారు. అది ఆయన శైలి. ఈ తరహా వ్యతిరేక ప్రచారం గతంలో ఎవరూ చేయలేదు. కానీ మోదీ మాత్రం దాన్నే నమ్ముకున్నారు. అది ఎంత వరకు వెళ్లిందంటే.. దాదాపు మూడు దశాబ్దాల కిందట చనిపోయిన రాజీవ్ గాంధీని సైతం విమర్శించేంతగా మారారు. నలభైలో ఉన్నవారికి కూడా రాజీవ్ గాంధీ గురించి అంతో ఇంతో తెలుసు. భోఫోర్స్ అనే స్కామ్ రాజకీయంగా ఎలా అస్త్రంగా మారిందో అందరికీ తెలుసు.
దశాబ్దాలు గడుస్తున్నా ఆ స్కామ్ ఇంత వరకూ నిరూపితం కాలేదని అందరికీ తెలుసు. కానీ స్కామ్ విచారణలో రాజీవ్ గాంధీ దోషిగా తేలినట్లు మోదీ ప్రకటించేశారు. ఎల్.టి.టి.ఈ తీవ్రవాద సంస్థ చేతుల్లో దారుణంగా హతమైన రాజీవ్ గాంధీని అవినీతి కేసుల కారణంగా చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అసలు చనిపోయిన రాజకీయ నేతల గురించి ఎవరూ చెడుగా చెప్పరు. చాలా దిగువస్థాయి రాజకీయ నేతలైనా ఈ విషయంలో సంయమనం పాటిస్తారు. కానీ మోదీ మాత్రం అలాంటి పట్టింపులేమీ పెట్టుకోలేదు. చౌకీదార్ చోర్ హై అంటున్న రాహుల్ గాంధీకి కౌంటర్ ఇవ్వాలంటే.. మీ నాన్నే దొంగ అనాలనుకున్నారు.. అనేశారు కూడా. తాను రాజీవ్ గాంధీతోనే పోటీ పడుతున్నట్లుగా విమర్శలకు పదును పెట్టారు. మోదీనే అలా ఉంటే.. ఆయన పార్టీ నేతలు ఎందుకు సైలెంట్‌గా ఉంటారు. అందరూ మోదీ స్థాయికి ఎదిగిపోయి ప్రచారం చేస్తారు.