నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ ప్రయాణాల కోసం వెచ్చించిన డబ్బు వివరాలను నిన్న పార్లమెంటులో వెల్లడించారు. 2014 జూన్ నుంచి నుంచి మోదీ విదేశీ పర్యటనల కోసం, ఛార్టెర్డ్ ఫ్లైట్స్, విమానాల నిర్వహణ, సదుపాయాల ఏర్పాటుకు రూ.2,021 కోట్లు ఖర్చైనట్లు ప్రభుత్వం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది. 2014 నుంచి 2018 మధ్యలో ప్రధాని మోదీ పర్యటించిన దేశాల జాబితాను కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ రాజ్యసభలో వెల్లడించారు. అందులో భారత్‌కు అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అందిస్తున్న తొలి పది దేశాలు ఉన్నాయి.
భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గతంతో పోలిస్తే పెరిగాయని వీకే సింగ్ వెల్లడించారు. 2014లో 30,930.5మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు రాగా, 2017లో 434 78.27మిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయని తెలిపారు. అంతకుముందు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనలకు 2009 నుంచి 2014 వరకు రూ.1,346కోట్లు ఖర్చైందని వెల్లడించారు. కాగా 2014 నుంచి 2018 వరకు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు రూ.2021కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. మోదీ 2014 మే నుంచి 48 విదేశీ పర్యటనల్లో 55 దేశాలను సందర్శించారని వెల్లడించారు.
2015లో అత్యంత ఖరీదైన చార్టెడ్ ఫ్లైట్‌లో ఆయన ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాల్లో 9రోజుల పాటు పర్యటించారు. మరో విదేశీ పర్యటన చేస్తే ఆయన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరిట ఉన్న రికార్డ్‌ను తిరగరాసినట్టవుతుంది. మన్మోహన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన పదేళ్ల కాలంలో 93 విదేశీ పర్యటనలకు వెళ్లారు. ప్రధాని మోదీ కేవలం నాలుగేళ్ల ఏడు నెలల కాలంలోనే 92 పర్యటనలకు వెళ్లారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల లోపు మోదీ మరో రెండు విదేశీ పర్యటనలకు వెళితే.. ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత అత్యధిక విదేశీ పర్యటనలు చేసిన రెండో ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డ్ సృష్టించే అవకాశముంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తన 15ఏళ్ల పదవీ కాలంలో 113 విదేశీ పర్యటనలు చేశారు.