‘ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లోనే డబ్బు తీసుకెళ్తుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి కనిపించదా? ప్రధానికి ఎన్నికల నియమావళి వర్తించదా? భాజపాకు ఎర్ర తివాచీ పరుస్తూ..విపక్ష పార్టీలపై ఈసీ ఒంటికాలి మీద ఎందుకు లేస్తోంది? అధికార పార్టీ ‘నమో టీవీ’ పేరుతో సొంత టీవీ ఛానల్‌ పెట్టుకుంటే ఏం చర్యలు తీసుకుంది. సాక్షి పత్రిక, ఛానల్‌పై మేం ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోగా.. వాటిలో ప్రచురించిన, ప్రసారమైన కథనాలు ఆధారంగా మాపై చర్యలు తీసుకుంటారా? రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని వ్యవస్థలతో ఎడాపెడా ఆడుకున్న ఈసీకి... కేంద్రంలోని ఐబీ, ఐటీ, ఈడీ వంటి సంస్థలు చేస్తున్న నిర్వాకాలు కనిపించలేదా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఈసీ వైఖరికి నిరసనగా ఎన్డీయేలో లేని పార్టీలతో కలసి జాతీయ స్థాయిలో ప్రజా ఉద్యమం చేపడతామని, ఉద్యమ కార్యాచరణ సిద్ధమవుతోందని వెల్లడించారు.

modi 166042019

సోమవారం ఉండవల్లిలోని ప్రజా వేదికలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలంటే ఎందుకు నిరాకరిస్తున్నారు? మీ సమస్యేంటి? ఈసీ ఎందుకు ఇన్ని అబద్ధాలు చెబుతోంది?వాళ్లు చేస్తోంది చాలా దుర్మార్గం’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఈవీఎంలలో సమస్యలు ఏర్పడి పని చేయకపోవడానికి (మాల్‌ఫంక్షనింగ్‌) ఆస్కారం ఉందే తప్ప, ట్యాంపరింగ్‌కు అవకాశం లేదని సీఈసీ చెబుతున్నారు. అలాంటి సమస్యలకు అవకాశం ఉన్న ఈవీఎంలను ఎందుకు వినియోగించాలి’ అని ప్రశ్నించారు. ‘ఈవీఎంలను ఎలా హ్యాక్‌ చేయవచ్చో... ఒక విజిల్‌ బ్లోయర్‌గా హరిప్రసాద్‌ ప్రదర్శించి చూపిస్తే... ఆయనపై తప్పుడు కేసు పెట్టారు. చివరకు మా పోరాటం ఫలితంగానే వీవీప్యాట్‌లు వచ్చాయి. వాటిని తెచ్చే ముందు అప్పటి సీఈసీలు హరిప్రసాద్‌ను పిలిచి సలహాలు తీసుకున్నారు’ అని చంద్రబాబు వివరించారు.

modi 166042019

ఈ ఎన్నికల్లో తెదేపా ఘన విజయం సాధిస్తుందని, 150కిపైగా సీట్లు గెలుచుకుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఈవీఎంలలో అవకతవకల గురించి నేను మాట్లాడుతుంటే..ఎన్నికల్లో తెదేపా ఓడిపోతుందన్న భయంతోనే ఇలా మాట్లాడుతున్నానని విపక్షాలు అంటున్నాయి. వాళ్ల మాటలు పట్టుకుని... మీరు ఓడిపోతారట కదా? అని మీడియా ప్రతినిధులు నన్ను అడుగుతున్నారు. నేను భయపడటమేంటి? పోలింగ్‌ రోజున ఎంత ఉద్ధృతంగా ఓటర్లు తరలి వచ్చారో చూశారు కదా? హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, పుణె తదితర ప్రాంతాల నుంచి ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో వచ్చి ఓట్లు వేశారు. చివరకు షిర్డీలోని ఒక అనాథాశ్రమంలో ఉంటున్న వృద్ధురాలు ప్రత్యేకంగా వచ్చి ఓటు వేశారు. చంద్రబాబుపై అభిమానంతో ఓటు వేయడానికి వచ్చానని చెప్పారు. ఈవీఎంలు మొరాయించి... మధ్యాహ్నం వరకు పోలింగ్‌ శాతం తగ్గితే, నేను ఒక్క పిలుపు ఇవ్వడంతో ఇళ్లకు వెళ్లిపోయిన వారు మళ్లీ వచ్చి ఓట్లు వేశారు. అర్ధరాత్రి వరకు వరుసలో నిలబడి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు’ అని చంద్రబాబు వివరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read