కేంద్రంతో కొనసాగిస్తున్న సఖ్యత నేపథ్యంలో మోడీ సర్కార్ తమ రాష్ట్రాలకు అరకొర నిధులు వెదజల్లినా ఏమీ అనలేక రెండు తెలుగు ప్రభుత్వాలు కక్కలేక...మింగలేక అన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిపై తిరుగుబాటు చేయలేక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లబోదిబో అన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నారా..? కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న ప్రతినిర్ణయానికి జైకొడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు బీజేపీ ప్రభుత్వం షాక్లు ఇవ్వడం వెనక అంతర్యమేమిటీ..? అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. బడ్జెట్ కేటాయింపుల్లో తమ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఏపీలోని అధికార వైసీపీ, తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ మండిపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సీన్ రిపీట్ అవుతోందా..? 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలసిపనిచేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత రెండు పార్టీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా కొనసాగాయి.
నాడు కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి అనేక పర్యాయాలు బడ్జెట్లో అన్యాయం చేసిందన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం బీజేపీతో సానుకూల వైఖరితో వైసీపీ, టీఆర్ఎస్లు కొనసాగుతున్నాయి. అయినా ఏపీకి గానీ ఇటు తెలంగాణ రాష్ట్రానికి గానీ మోడీ సర్కార్ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో న్యాయం చేయలేదన్న వాదన అన్ని వర్గాల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అన్యాయంపై నేరుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం స్పందించలేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కక్కలేక... మింగలేక అన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలావుంటే గతంలో టీడీపీకి చుక్కలు చూపించిన బీజేపీ ఇప్పుడు వైసీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలతోనూ అదే పంథా కొనసాగిస్తోందా...? అసలు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇలా బడ్జెట్లో జరిగిన అన్యాయంపై గళం ఎత్తలేక, పోరాడలేక రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కక్కలేక.. మింగలేక అన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.