ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షించి లబ్ధి పొందాలనుకునే నాయకులను చూశాం. అలాగే అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసి ఓట్లు రాబట్టాలని చూసే నేతలకైతే కొదవే లేదు. ఇలా ఓట్లను దండుకోవడమే పరమావధిగా భావించే నాయకులు అనేక రకాల మార్గాలను ఆశ్రయిస్తున్నారు. తాజాగా గుజరాత్‌లోని ఫతేపూర్‌కు చెందిన రమేశ్ కటారా అనే ఎమ్మెల్యే ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేశారు. భాజపాకు ఎవరు ఓటు వేశారో లేదో మోదీకి తెలిసిపోతుందంటూ వ్యాఖ్యానించారు. ఈసారి అన్ని పోలింగ్ బూత్‌లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తున్నారని.. ఇక మీరు భాజపాకు ఓటు వేశారో లేదో మోదీ చూస్తారంటూ బెదిరించాడు. ఎక్కడైతే భాజపాకు తక్కువ ఓట్లు వచ్చాయో ఆ ప్రాంత అభివృద్ధికి తక్కువ నిధులు కేటాయిస్తారని చెప్పుకొచ్చారు. దీంతో దీనికి సంబంధించిన వీడియో ఒకటి స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.
దీనిపై స్పందించిన గుజరాత్ కాంగ్రెస్ శాఖ సదరు ఎమ్మెల్యేపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ విషయంపై ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. దీనిపై ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించి తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు. ఇటీవల మరో భాజపా నేత ప్రచారంలో మాట్లాడుతూ..భాజపాకు ఓటు వేయని పక్షంలో తీవ్ర చర్యలు ఉంటాయని ఓటర్లను బెదిరించారు. దీనిపై కాంగ్రెస్.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఈసీ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. అయినా నేతల్లో మార్పు రాకపోవడం విచారకరం.
మరో పక్క మేనకాగాంధీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. ఫిలిభిత్‌లో ప్రతిసారి గెలుస్తున్నాను. ఏ గ్రామాన్ని ఎక్కువ అభివృద్ధి చేయాలి, ఏ గ్రామాన్ని తక్కువ అభివృద్ధి చేయాలనేదానికి కొలబద్ద ఏమిటి?. అందుకే ఓట్లు పడే గ్రామాలను ఏ,బీ,సీ,డీలుగా విభజించాం. 80శాతం ఓట్లు మాకు వేసిన గ్రామం ‘ఎ’ తరగతికి చెందుతుంది. 60శాతం వస్తే ‘బి’, 50శాతం వస్తే ‘సి’, అంతకంటే తక్కువ వస్తే ‘డి’. ముందుగా ‘ఎ’ తరగతి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తాం. తరువాత వరుసగా బి,సి,డి గ్రామాల్లో చేపడతాం. ఇందులో ఏ తరగతిలో ఉండాలనేది మీకే వదిలేస్తున్నాను అంటూ, బెదిరించే ప్రయత్నం చేసారు.