ప్రధాని నరేంద్ర మోదీ పేరు మార్చుకున్నారు. నిజంగా కాదు.. ట్విటర్‌లో. సోషల్ మీడియాలో మై భీ చౌకీదార్ పేరుతో సరికొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఒక రోజు గడవక ముందే అంటే ఆదివారం ట్విటర్ హ్యాండిల్ పేరును నరేంద్ర మోదీ నుంచి చౌకీదార్ నరేంద్ర మోదీగా మార్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మై భీ చౌకీదార్(నేను కూడా కాపలాదారుడినే) అంటూ బీజేపీ ప్రచారానికి ఊపు తెచ్చిన ప్రధాని మోదీ.. తాజాగా తన ట్విట్టర్ ఖాతా పేరును కూడా 'చౌకీదార్'గా మార్చేశారు. మోదీని ఫాలో అవుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, జేపీ నడ్డా, బీజేపీ ఐటీ ఇన్‌చార్జి అమిత్ మాలవియా, బీజేపీ అధికార ప్రతినిధి తాజిందర్ భగ్గా కూడా తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలకు చౌకీదార్ ట్యాగ్ తగిలించుకున్నారు.
పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు కూడా తమ అధికారిక ట్విట్టర్ ఖాతాల్లో చౌకీదార్ పేరును తగిలించుకున్నారు. ఉత్తరాఖండ్ సీఎం త్రివేండ్ర సింగ్ రావత్, జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ వారిలో ఉన్నారు. ఇదిలా ఉంటే, మోదీ చౌకీదార్‌గా పేరు మార్చుకోవడంపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దొంగలంతా మోదీ ఇంటి పేరు(చౌకీదార్) పెట్టుకోవడం చూస్తుంటే తనకు చాలా ఆశ్చర్యం కలుగుతోందని బీజేపీ నేతలను ఉద్దేశించి సెటైర్ వేశారు. కాగా, అవినీతిపై వ్యతిరేక పోరాటానికి పిలుపునిస్తూ శనివారం 'మై భీ చౌకీదార్' క్యాంపెయిన్‌ను మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
"మీ కాపలదారుడు నిబద్దతతో ఉన్నాడు.. దేశానికి సేవ చేస్తున్నాడు. అయితే నేను ఒంటరిగా లేను. దేశంలో అవినీతిపై, సామాజిక సమస్యలపై పోరాడుతున్న ప్రతీ ఒక్కరు చౌకీదారే(కాపలదారు). దేశ పురోగతి కోసం పాటుపడుతున్న ప్రతీ ఒక్కరూ చౌకీదారే. "— అని ప్రధాని మోదీ శనివారం ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందేశానికి మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియోను జత చేశారు. మోదీని ప్రతిపక్షాలు తరచూ చౌకీదార్ అనే పేరుతో ఎద్దేవా చేస్తుంటాయి. దీంతో ఆయన శనివారం ‘మై భీ చౌకీదార్’ (నేనూ కాపలాదారునే) పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా ట్విటర్ పేరు మార్చుకోవడం గమనార్హం.