వారణాసిలో నిజామాబాద్, తమిళనాడుకు చెందిన రైతుల ఆందోళన చేపట్టారు. తమను నామినేషన్ వేయకుండా ఎన్నికల కమిషన్ (ఈసీ), పోలీసులు అడ్డుకున్నారని పేర్కొంటూ వారు ఆందోళనకు దిగారు. ఈసీ, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు మద్దతిచ్చిన స్థానికులను కూడా బెదిరించారని రైతులు ఆరోపించారు. పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నలకు మద్దతు ధర అనే డిమాండ్లతో తమ నిరసనను తెలియజేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వారణాసిలో రైతులు పోటీకి సిద్ధమయ్యారు. ఐతే.. వారంతా నామినేషన్లు వేయకూడదనేదే మోదీ సర్కారు లక్ష్యం. వారణాసిలో మోదీ సేన వారికి అడుగడుగునా చుక్కలు చూపిస్తోంది. బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. పసుపు రైతులను అడ్డుకుంటున్నారు.
నామినేషన్లు వేసేందుకు వారికి ప్రతిపాదకులు లేకుండా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఏకంగా రైతన్నలపై ఇంటెలీజెన్స్ బ్యూరో(ఐబీ)ని దింపింది. ఐబీ అధికారులు ఉదయం రైతులు బస చేసిన సిల్క్ సిటీ లాడ్జిపై దాడి చేశారు. గదుల్లో దిగినవారి అడ్రస్ ప్రూఫ్‌లు ఇవ్వాలని లాడ్జి యజమానిపై ఒత్తిడి తెచ్చారు. గమనించిన రైతులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చేశారు.తాము అద్దెకు తీసుకున్న బస్సులో అక్కడి నుంచి వెళ్లేందుకు యత్నించగా.. ‘మీరు బస్సెక్కితే.. బస్సుతోపాటు మిమ్మల్ని పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్తాం..’ అని పోలీసులు బెదిరించారు. దీంతో వారంతా పోలీసులకు చిక్కకుండా గ్రూపులుగా విడిపోయి.. ఆటోల్లో సిటీ దాటారు.
చివరికి స్థానిక మీడియా, లాయర్ల సాయంతో అదే లాడ్జికి తిరిగి వచ్చారు. ఇన్ని రోజులు స్థానిక బీజేపీ నేతలతో బెదిరింపులకు గురిచేసినా..మాట వినడం లేదనే అక్కసుతోనే ఆదివారం ఐబీని రంగంలోకి దింపారని రైతులు ఆరోపిస్తున్నారు. మీడియా, లాయర్ల సహకారంతో సోమవారం నామినేషన్లు వేసితీరుతామని రైతులు ప్రకటించారు. ఇవాళ కూడా వారికి అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. నిజామాబాద్ నుంచి మొత్తం 45 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళితే కేవలం 15 మంది రైతుల నామినేషన్లను మాత్రమే అధికారులు స్వీకరించారు. మిగితా రైతుల నామినేషన్లను అధికారులు స్వీకరించలేదు. తమకు మద్దతిచ్చిన స్థానికులను బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.