ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు నిరసనగా తొలుత అనుకున్నట్టుగా జనవరి ఒకటిన కాకుండా మరో రోజు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది. జనవరి 1న నిరసన తెలపాలి అని అనుకున్నా, ఆ రోజున ప్రజలు కొత్త సంవత్సర మూడ్ లో ఉంటారని, అది చెడగొట్టకుండా, ముందు రోజు కాని, తరువాత రోజు కాని చెయ్యాలనే యోచనలో ఉన్నారు. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తారు. గుంటూరులో జరిగే నిరసన ప్రదర్శనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. దాదపుగా 20 కిమీలు పాదయాత్ర చేసేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ప్రదర్శన చివర్లో బహిరంగ సభ నిర్వహిస్తారు. నిరసన ప్రదర్శన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్వహించాలి? సభ ఎక్కడ నిర్వహించాలి? అన్న అంశాన్ని నిర్ణయించే బాధ్యతను గుంటూరు జిల్లా నాయకులకు పార్టీ అప్పగించింది.
మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆదివారం గుంటూరులో సమావేశమై దీనిపై చర్చించారు. గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి పోలీసు పరేడ్ గ్రౌండ్స్ వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ సభ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 6న రాష్ట్రానికి వస్తున్నారు. గుంటూరు సమీపంలో జరిగే సభలో పాల్గొంటారు. మరో పక్క ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ వైపు నుంచే కాకుండా, వివిధ సంస్థలు, సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నారు. ఏపి ప్రజల బాధను, నిరసనను మోడీకి తెలిసేలా, కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.
రాష్ట్ర ప్రజానీకానికి ద్రోహం చేసిన ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి వీల్లేదని, ‘ప్రధాని మోదీ గో బ్యాక్’ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని విద్యార్థి యువజన సంఘాల ఐకాస పిలుపునిచ్చింది. డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.అశోక్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రవిచంద్రలు మాట్లాడారు. అన్ని రకాలుగా ఏపీని మోసం చేసిన ప్రధాని రాకను అడ్డుకుంటామని, రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ నెల 30న అన్ని జిల్లా కేంద్రాల్లో నల్లజెండాలతో నిరసన, జనవరి 3న మోదీ ఆంధ్రప్రదేశ్‌కు రావద్దని, జనవరి 4న రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల వరకు ఆందోళనలు, జనవరి 6న గుంటూరులో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలు చేయనున్నట్టు చెప్పారు. అయితే మోడీ రాక పై పవన్, జగన్ ఇప్పటి వరకు స్పందించలేదు.