దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రోజువారీ ధరల పేరుతో చమురు సంస్థలు సైలెంట్‌గా వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. శుక్రవారం నాడు పెట్రోలు, డిజల్ పై ఒక్క రోజులోనే 50 పైసలు పెరిగాయి. లీటరు పెట్రోలుపై 48 పైసలు, డీజల్‌పై 47 పైసలను చమురు సంస్థలు పెంచాయి. దీంతో రికార్డు స్థాయిలో లీటరు పెట్రోలు ధర ఢిల్లిలో రూ.79.99కి, ముంబైలో రూ.87.39కి చేరుకుంది. డిజల్ ఢిల్లిలో రూ.72.07, ముంబైలో రూ.76.51 చేరింది. ఎన్నడూలేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్య వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకూ లీటర్ పెట్రోల్ ధర రూ.2.85 మేర, డీజిల్ ధర రూ.3.30 మేర పెరిగింది.
ఈ ధరల్లో అత్యధికంగా కేంద్ర, రాష్ట్రాల పన్నులే ఉంటున్నాయి. ప్రస్తుతం కేంద్రం లీటర్ పెట్రోల్‌పై రూ.19.48, డీజిల్‌పై రూ.15.33 మేర ఎక్సైజ్ సుంకాన్ని వడ్డిస్తోంది. అదనంగా రాష్ట్రాలు కూడా విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను వసూలు చేస్తున్నాయి. అత్యధికంగా పెట్రోల్ పై మహారాష్ట్ర 39.12%.. డీజిల్‌పై తెలంగాణ 26% వ్యాట్‌ను వర్తింపజేస్తున్నాయి. పెట్రో ధరలు రికార్డు స్థాయి చేరడంతో దేశంలోని ప్రతిప క్షాలు నిరసన బాట పట్టాయి. వచ్చే వారం దేశవ్యాప్తంగా ఆందో ళనలు చేపట్టనున్నాయి. ఎన్డీయే హయాంలో లీటర్ పెట్రోల్ ధరను రూ.100 మార్కును దాటించాలనుకుంటున్నారా?’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ ప్రశ్నించింది.
డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా సోమవారం నాడు ‘భారత్ బంద్’ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ప్రతిపక్షాల ఆందోళనపై నేరుగా స్పందించని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పెట్రోలు, డీజల్ పై విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంపై నోరు మెదపటం లేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో తేడా రావడంతోనే దేశియంగా పెట్రోలు, డీజల్ ధరల్లో హెచ్చు తగ్గులు వస్తున్నాయన్నారు. మరోవైపు డీజిల్ ధర రికార్డు స్థాయికి చేరుకోవడంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర ధరల పై పెను ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే కూరగాయల ధరలు ఆకాశాన్నంటి సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు.