ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. తితలీ తుపాన్ ప్రభావంపై ఆరా తీశారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మోదీ. కాగా సీఎం చంద్రబాబుఅమరావతి నుంచి శ్రీకాకుళం వెళ్లారు. తొలుత విశాఖకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డుమార్గాన శ్రీకాకుళానికి చేరుకున్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా వాసులను పరామర్శించనున్నారు. సహాయ, పునరావాస చర్యలను పర్యవేక్షించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు నారాయణ, పితాని సత్యనారాయణ శ్రీకాకుళం చేరుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తితలీ తుపాను బీభత్సం సృష్టించింది.
బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం దాకా శ్రీకాకుళం జిల్లావాసులు ఊపిరి బిగబట్టుకొని గడిపారు. తుఫాను మిగిల్చిన బీభత్స ఛాయలు ఉద్దానంలో అడుగడుగునా కనిపించాయి. ఉద్దానంలో లక్షల ఎకరాల్లో కొబ్బరి చెట్లు సాగుచేశారు. పెను గాలులు, భారీ వర్షాలకు ఒక్కో ఎకరానికి 30శాతం చెట్లు నేలకూలి ఉంటాయని అంచనా. ఊపేసిన గాలులకు ఈ జిల్లాలో లక్షలాది చెట్లు, వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మొత్తం 12 మండలాల్లో తుఫాను గాలుల తీవ్రతకు పెను విధ్వంసం చోటుచేసుకుంది. కొబ్బరితోటలు లక్షలాది ఎకరాల్లో ధ్వంసం అయ్యాయి. 15వేలు దాకా విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.
పలాస, సోంపేట తదితర మండలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఎగిరిపడ్డాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. అధికారులు, సహాయక బృందాలు సైతం తుఫాను తీవ్రత, గాలులకు భయపడి సాయంత్రం దాకా అడుగు బయటకు వేయలేకపోయారు. శ్రీకాకుళం జిల్లాలో జాతీయరహదారి రూపురేఖలు కోల్పోయింది. నరసన్నపేట దాటాక ఇచ్ఛాపురం వరకు హైవేపై వేలాది చెట్లు పూర్తిగా నేలకొరిగాయి. పలాసకు దగ్గరలోని కృష్ణాపురం టోల్‌గేట్ నేలమట్టమైంది. హైవే వెంబడి పదుల సంఖ్యలో ఉన్న పెట్రోల్ బంకుల పై కప్పులు ఎగిరిపోయాయి. హైవే పక్కన ఉన్న దాబాలు, హోటళ్లు దెబ్బతిన్నాయి. చెన్నై-కోల్‌కతా హైవేను ఆనుకుని ఉన్న పలుగెడ్డలు రోడ్డుపైకి పొంగిపొర్లడంతో ఆ దారిలో కొన్నిగంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. బొప్పాయిపురం వద్ద హైవేపై 15 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.