ముఖ్యమంత్రిగా చూడాలనేది తమిళ ప్రజల కోరికని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం చెన్నైకు వచ్చిన ఆయన డీఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. అనంతరం డీఎంకే ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అన్నాడీఎంకేకు ఓటేస్తే మోదీకి వేసినట్టేనని అన్నారు. రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం మనకు వద్దని అన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. జల్లికట్టును నిషేధించి మోదీ తమిళ సంస్కృతిని అవమానపరిచారని విమర్శించారు. ఐటీ దాడులు టీడీపీ, డీఎంకే, తృణమూల్‌పైనే ఎందుకు జరుగుతున్నాయి? అన్నాడీఎంకే, బీజేపీ నాయకులపై ఎందుకు జరగలేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
ద్రవిడ సంస్కృతి చాలా విశిష్టమైనది.. వారితో పెట్టుకున్నవారెవరూ గెలిచిన దాఖలాలు లేవని అన్నారు. తమిళుల ఆత్మగౌరవంతో మోదీ ఆడుకోవాలనుకున్నారని, జట్టికట్టు లాంటి విషయాల్లో తమిళులు పోరాటం అభినందనీయమని కొనియాడారు. తమిళ రైతులు ఢిల్లీలో అర్ధనగ్న నిరసనలు తెలిపిన ప్రధాని మోదీ పట్టించుకోలేదని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికల ముందు సాయం చేస్తామంటూ మభ్యపెడుతున్నారని, బీజేపీకి రైతులే తగిన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు. అన్నాడీఎంకే మోదీ చేతిలో కీలు బొమ్మ అయిపోయిందన్నారు. మోదీ చెప్పినట్టల్లా ఆడుతోందని విమర్శించారు. స్టాలిన్ తిరుగులేని నాయకుడిగా నిలిచారని, తమిళనాడు ప్రజలు స్టాలిన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. మోదీని ఓడించేందుకు స్టాలిన్‌తో కలిసి పనిచేస్తామన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తి.. ఆగ్రహాలే మోదీకి బుద్ధి చెబుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.
ఏమైనా అంటే మోదీ గుజరాత్ మోడల్ అంటారని, అసలు గుజరాత్ మోడల్ ఎక్కడుందని ప్రశ్నించారు. తమిళనాడులాంటి రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్ సాధించింది ఎంత? అని అన్నారు. మోదీ వైఫల్యాలను రఘురాంరాజన్ వంటి వాళ్లు... అర్థమయ్యేలా చెప్పి... పరిష్కారం చూపారని, అందుకే అలాంటివారంటే మోదీకి గిట్టదని చంద్రబాబు అన్నారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు భవిష్యత్‌లో కలిసి పనిచేస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక కూటమే అధికారంలోకి వస్తుందని, స్టాలిన్ క్రియాశీలక పాత్ర పోషిస్తారని అన్నారు. డీఎంకేకు ఓటేసి గెలింపించాలని చంద్రబాబు నాయుడు తమిళనాడులోని తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.