పార్లమెంట్ ఎన్నికలు నెలన్నర ముందుగానే వచ్చే అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రాభవం కోల్పోకముందే ప్రజాతీర్పు కోరితే అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశముందనే అభిప్రాయం బీజేపీ అగ్రనేతల నుంచి వినిపిస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికల ముందు నిర్వహించిన అనేక సర్వేలు 2019 ఎన్నికల్లోనూ ఎన్డీఏ అధికారంలోకి రానున్నారని, అయితే ఈసారి బీజేపీ సీట్ల సంఖ్య తగ్గే అవకాశాలున్నాయని వెల్లడైంది. ఎన్డీఏ మిత్రపక్షాల మీదనే బీజేపీ ఆధారపడాల్సి ఉందని హెచ్చరికలు వచ్చాయి. తాజాగా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లి ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం కాగా, మధ్యప్రదేశ్‌లో గట్టిపోటీ ఇచ్చినప్పటికీ అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ప్రతి పక్ష కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లోనూ పాగా వేయడం తోపాటు 2019 సార్వత్రిక ఎన్నికలకు ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటుకు యత్నా లు ముమ్మ రం చేసిన దరిమిలా ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకమునుపే సాధ్యమైనంత త్వరలో లోక్‌సభ ఎన్నికలకెళ్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అని బీజేపీ అధినాయత్వం యోచిస్తోంది.
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో ‘హిందీ బెల్ట్’గా గుర్తింపు పొందిన ఈ రాష్ట్రాల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా, ఎంపీ ఎన్నికల్లో ఒకటి రెండు స్థానాలు తగ్గినప్పటికీ, కాంగ్రెస్ కంటే బీజేపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుపొందే అవకాశా లున్నాయని సర్వేలు చెబుతున్న విషయాన్ని బీజేపీ పెద్దలు గుర్తుచేస్తున్నారు. అయితే ఇక్కడ ఎన్డీఏ మళ్లి అధికారంలోకి రావాలంటే మిత్రపక్షాల సహకారం అత్యంత ఆవశ్యకం. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామి ఆర్‌ఎల్‌ఎస్‌పీ గుడ్‌బై చెప్పింది. ఆ పార్టీ అధ్యక్షుడు కుష్వాహ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, బీహార్‌లో లాలూప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ కూటమిలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. అంతకుముందే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లోనే ఎన్డీఏ నుంచి బయటకొచ్చేసింది. శివసేన, అకాలీదళ్ కూడా బీజేపీ పెద్దల తీరుపై గుర్రుగా ఉంది. భాగస్వామ పక్షాలను పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మిత్రపక్షాలను బుజ్జగించి, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి కట్టుగా పోటీ చేయాలని నిర్ణయానికి బీజేపీ పెద్దలు వచ్చినట్లు సమాచారం.
ముందస్తు ఎన్నికల ప్రక్రియకు బీజేపీ పెద్దలు చేపట్టిన చర్యలు ఫలప్రదిస్తే మాత్రం పార్ల మెంట్ రద్దు లాంఛనప్రాయమే అవుతుంది. అంత కంటే ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. ఆ తతంగానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు అనేక కొత్త పథకాలు ప్రకటించే అంశాలను బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం లభించిన వెంటనే, లోక్‌సభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని మోడీ, అమిత్ షా ద్వయం యోచన. అదేగనుక జరిగితే సార్వత్రిక ఎన్నికలకు ఫిబ్రవరి ఆఖరి వారంలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఏప్రిల్ మొదటి వారానికంతా ఎన్నికల ప్రక్రియ ముగించి, రెండో వారంలోనే ఢిల్లిలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అయితే ఈ ఎన్నికలతో పాటే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయో లేదో, తెలియాల్సి ఉంది.