మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ చేసిన వ్యాఖ్యలు విని ప్రధాని నరేంద్రమోదీ సతీమణి జశోదాబెన్ షాక్‌కు గురయ్యారు. ఓ గుజరాతీ దిన పత్రికతో గవర్నర్ మాట్లాడుతూ మోదీకి వివాహం కాలేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై జశోదాబెన్ స్పందించారు. మీ మీ రాజకీయం కోసం నన్ను వాడుకుంటారా ? అంటూ బీజేపీ నేతల పై మోడీ భార్య ఫైర్ అయ్యారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఆనందీబెన్, రెండు రోజుల క్రితం ఒక కార్యక్రమంలో "మీకు ఒక విషయం తెలుసా, నరేంద్రభాయి మోదీ పెళ్లి చేసుకోలేదు, అయినా, ఆయన మహిళలు, పిల్లల బాధను అర్థం చేసుకోగలరు" అన్నారు.మోదీ 'అవివాహితుడు' అంటూ ఆనందీబెన్ చేసిన వ్యాఖ్యలపై, జశోదాబెన్ విచారం వ్యక్తం చేశారు.
ఆనందీబెన్ చేసిన ఆ వ్యాఖ్యలపై, జశోదాబెన్, ఆమె కుటుంబ సభ్యులు చాలా కలత చెందుతున్నారు. "నరేంద్ర మోదీకి పెళ్లైందని అందరికీ తెలుసు, అయినా జనం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు" అని జశోదాబెన్ అన్నారు. ఆనందీబెన్ మాటలు పూర్తిగా అవాస్తవం అని జశోదాబెన్, ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాజకీయ కారణాలతోనే ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. "రాజకీయాల కోసం నరేంద్రమోదీ, జశోదాబెన్ గురించి అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదు" అని జశోదాబెన్ సోదరుడు అశోక్ మోదీ అన్నారు.
నరేంద్ర మోదీ 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమర్పించిన నామినేషన్ పత్రాల్లో తన వైవాహిక స్థితి గురించి ఎలాంటి వివరాలూ ఇవ్వలేదు. 2014లో లోక్‌సభ ఎన్నికలకు ముందు తన అధికారిక అఫిడవిట్‌లో తనకు వివాహం అయ్యిందని మోదీ మొదటిసారి అంగీకరించారు. ఆయన నామినేషన్ పత్రాల్లో, జశోదాబెన్‌ను తన భార్యగా పేర్కొన్నారు. అయితే, పాన్‌కార్డ్, ఆస్తులకు సంబంధించిన ఇతర పత్రాల్లో మాత్రం ఆమె గురించి ఎలాంటి వివరాలూ ఆయన ఇవ్వలేదు. ఇంతకాలం అయినా మోదీ జశోదాబెన్‌ను తన భార్యగా స్వీకరించకపోవడం, మహిళల పట్ల ఆయనకు ఉన్న ఉదాసీన వైఖరిని సూచిస్తోందని విమర్శకులు అంటున్నారు.