ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఐదేళ్ల పదవీ కాలంలో మొట్టమొదటి సారిగా మీడియా సమావేశం నిర్వహించారు. న్యూఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మోదీతో పాటు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్నారు. అయితే మీడియా కొన్ని ప్రశ్నల్ని ప్రధాని నరేంద్రమోదీకి సంధించగా ‘‘సమాధానం ఇవ్వాల్సిన అవసరం మోదీకి లేదు’’ అని అమిత్ షా సమాధానమిచ్చారు. గాడ్సే దేశభక్తుడంటూ సాధ్వీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘ఒక వేళ ఈ ఎన్నికల్లో ప్రగ్యా సింగ్ ఎంపీగా గెలిస్తే, బీజేపీ ఆమెను పార్టీలో కొనసాగిస్తుందా లేదంటే తొలగిస్తారా?’ అని ప్రముఖ హిందీ ఛానల్ ఆజ్ తక్ ప్రధాన మంత్రికి ఓ ప్రశ్న వేసింది.
అయితే మీడియా సమావేశం ప్రారంభం నుంచి మౌనంగా మోదీ.. ఆజ్ తక్ వేసిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. ఇంతలో అమిత్ షా కలుగ జేసుకొని ‘‘పార్టీ ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఆమె దానికి సమాధానం చెప్పిన వెంటనే క్రమశిక్షణా కమిటీ ఓ నిర్ణయం తీసుకుంది’’ అని సమాధానం చెప్పారు. అంతే కాకుండా పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సమయంలో జరుగుతున్న హింస, బజేపీపై మమత బెనర్జీ చేస్తున్న ఆరోపణలు, రాఫెల్‌పై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు, ఇతరులు బీజేపీపై చేస్తున్న ఆరోపణల గురించి మీడియా మోదీని ప్రశ్నించింది. అయినప్పటికీ మోదీ వీటికి సమాధానం చెప్పలేదు. దాదాపుగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షానే అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు.