రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని తిరువనంతపురం నుంచి టిక్కెట్ ఇస్తామంటూ బీజేపీ నేతల బహిరంగ ప్రతిపాదనలపై ప్రముఖ మలయాళ నటుడు, సూపర్‌స్టార్ మోహన్‌లాల్ స్పందించారు. తాను రాజకీయాల్లోకి వచ్చేది కానీ, ఎన్నికల్లో పోటీ చేసేది కానీ లేదని అన్నారు. 'రాజకీయాలు నా పని కాదు. నటుడిగా ఉండటానికే నేను ఎప్పుడూ ఇష్టపడతాను. ఈ వృత్తిలో స్వేచ్ఛను నేను ఆస్వాదిస్తున్నాను. రాజకీయాల్లో అయితే అలా కాదు. ఎందరో ప్రజలు మనపై ఆధారపడతారు. ఆశలు పెట్టుకుంటారు. వాటిని నెరవేర్చడం అంత సులభం కాదు. నాకు రాజకీయాల గురించి తెలియదు' అని ఆయన చెప్పారు. ప్రస్తుతం మోహన్‌లాల్ ఇక్కడ జరుగుతున్న 'మరక్కర్' మలయాళ చిత్రం షూటింగులో ఉన్నారు. కేరళలో బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే ఓ.రాజగోపాల్ మాత్రమే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ నుంచి గెలుపు అవకాశాలున్న మోహన్‌లాల్‌కు లోక్‌సభ టిక్కెట్ ఇచ్చే ఆలోచన ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాగా, ఇటీవల కాలంలో మోహన్‌లాల్ కేరళ బీజేపీ-ఆర్ఎస్‌ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉండటం, గత ఏడాది సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకోవడంతో మోహన్‌లాల్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వెలువడ్డాయి. తన ఆధ్వర్యంలోని విశ్వశాంతి ఫౌండేషన్ చేస్తున్న సేవాకార్యక్రమాలను ప్రధానితో కలిసిన సమావేశంలో మోహన్‌లాల్ వివరించారు. కాగా, ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా మోహన్‌లాల్‌కు కేంద్ర ప్రభుత్వం 'పద్మభూషణ్' ప్రకటించింది. సినీరంగంలో చేసిన సేవలకు గాను ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు.