జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయ్యింది. ఈ రెండు నెలల్లో జగన్ మార్క్ పరిపాలన ఏమైనా చూసామా అంటే, ఏమి లేదనే చెప్పాలి. యువకుడుని అని చెప్పుకుంటూ, జగన్ మొహన్ రెడ్డి, ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్లోకి వెళ్లి, అధికారం సంపాదించుకున్నారు. అయితే ఈ రెండు నెలల్లో మాత్రం, చెప్పుకోదగ్గ మార్పు, లేకపోతే సహజంగా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు, కనిపించే స్పష్టమైన పాలసీ చేంజ్ అయితే కనిపించలేదని చెప్పాలి. 5గురు డిప్యూటీ సియంలు అంటూ మొదలు పెట్టిన జగన్, తరువాత తరువాత, మొత్తం చంద్రబాబు పైనే ఫోకస్ పెట్టారు. చంద్రబాబు ప్రజా వేదిక ఇవ్వమని అడిగితే, వెళ్లి దాన్ని కూల్చేసారు. చంద్రబాబు పై ప్రతి విషయంలో ఎంక్వయిరీ కమిషన్ కు వేసుకుంటూ వెళ్తున్నారు.
ఇక గత రెండు వారాలుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో, అధికార పక్ష ప్రవర్తన చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి రెండు నెలలు అధికారం పూర్తీ చేసుకోవటంతో, సహజంగానే ఆయన పాలన పై విశ్లేషణలు వస్తాయి. ఇదే కోవలో ప్రముఖ బిజినెస్ ఛానెల్, మనీ కంట్రోల్, జగన్ మోహన్ రెడ్డి రెండు నెలల పాలన పై, ఎడిటోరియల్ కధనం ప్రసారం చేసింది. జగన్ మోహన్ రెడ్డి రాజకీయ నిర్ణయాలు, దేశానికీ ఎలా శాపంలాగా అయ్యాయి అంటూ, ఆ ఎడిటోరియల్ నడిచింది. ముఖ్యంగా జగన మోహన్ రెడ్డి తీసుకున్న మూడు నిర్ణయాల పై మనీ కంట్రోల్ తన విశ్లేషణను అందించింది. కేవలం సంక్షేమం అంటూ, కూర్చుని, యాంటీ కరప్షన్ అని చెప్పుకుంటే, దాన్ని పరిపాలన అనరు అంటూ విమర్శలు గుప్పించింది.
చంద్రబాబు ప్రభుత్వంలో, ప్రాజెక్ట్ లు ఇచ్చి, ఇప్పటికి 25 శాతం అవ్వకపోతే, పనులు ఆపెయ్యాలి అని జగన్ మొహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవటాన్ని తప్పు బట్టింది. ఇప్పటికే అమరావతిలో, ఎల్ అండ్ టీ సంస్థ, ఈ నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోయిందని చెప్పింది మనీ కంట్రోల్. జగన్ మోహన్ రెడ్డికి అమరావతి అంటే ఇష్టం లేదు, అందుకే అమరావతిని ఇలా ఆపేస్తున్నారు అని విమర్శించింది. మరో పక్క చంద్రబాబు హయంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల పై సమీక్ష చెయ్యటం, అతి పెద్ద తప్పుగా అభివర్ణించింది. ఇది కూడా చంద్రబాబు మీద రాజకీయ కక్షతో చేస్తున్న పని అని, దీని వల్ల పెట్టుబడి దారులు రారని చెప్పింది. ఇక రెండు రోజుల క్రిందట, పరిశ్రమల్లో 75 శాతం లోకల్ రిజర్వేషన్లను, పొలిటికల్ స్టంట్ గా అభివర్ణించింది. దీని వల్ల పెట్టుబడులు రావని, మిగతా రాష్ట్రాలు కూడా ఇలాగే ఆలోచిస్తే, పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తుందని, మనీ కంట్రోల్ విశ్లేషించింది. మరి జగన్ గారు, వీరు చెప్పినవి పాజిటివ్ గా తీసుకుంటారో, లేక ఆ రెండు పత్రికల్లో, దీన్ని కూడా చేర్చి బ్యాన్ చేస్తారో చూడాలి.