కాంగ్రెస్ హయాంలో కేంద్రంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా పని చేసిన మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు వంటి డైనమిక్ ముఖ్యమంత్రి ఉన్నారని మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా అన్నారు. ఆయన చేపట్టిన కొత్త రాజధాని నిర్మాణం అమరావతి వల్ల పదేళ్లలో ఏపీలో అద్భుత ఫలితాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ఆర్థికసంఘం శతవార్షిక సమావేశాలకు గుంటూరు వచ్చిన సందర్బంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
అమరావతి నిర్మాణం అంటే ఉద్యోగాల కల్పనే అని, ఆంధ్రప్రదేశ్ కి విశాలమైన తీర రేఖ ఉండటంతో కొత్త పోర్టులకు అవకాశం ఉందన్నారు... కొత్త రాజధాని అమరావతి నిర్మాణం చాలా తెలివైన పని. ఎన్నో పెట్టుబడులు వస్తాయి. దేశవిదేశాల నుంచి అనేకమంది ఇక్కడికి వస్తారు. రాత్రికి రాత్రి జరిగిపోదు కానీ, అమరావతి వల్ల పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు అద్భుత ఫలితాలు ఉంటాయని చెప్పగలను అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అనుభవం ఉన్న వ్యక్తి సియంగా ఉండటం, రాష్ట్రానికి ఏంతో మేలు చేస్తుంది అని అన్నారు...
ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎందరో ప్రతిభావంతులు ఉన్నారని అన్నారు. రానున్న ఐదు, పదేళ్లలో 8 శాతం లక్ష్యంగా పనిచేస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయని అన్నారు. రెండుమూడేళ్లగా వ్యవసాయరంగ వృద్థి తగ్గుతూ వస్తోందని, వ్యవసాయ రంగానికి దూరమౌతున్న వారికి పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా పల్లెల్లో కూడా ఇతర రంగాల్లో ఉపాధి కల్పించాలని, ఇదే సమయంలో నగరాలను విస్తరించాలని అన్నారు. అమరావతి లాంటి కొత్త సిటీలు ఈ దేశానికీ ఎంతో అవసరం అని అన్నారు.