రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య ప్రమాణాలను ఎప్పటికప్పుడు గుర్తించి సలహాలనిచ్చేందుకు అన్ని గ్రామపంచాయతీల్లో త్వరలో ప్రత్యేక పరికరాలను అందుబాటులోకి తేనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా, ప్రతి ఒక్కరికీ ఈ తరహా పరీక్షలు చేయించే బృహత్తర కార్యక్రమంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించి అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక విధానాలను, ఉపకరణాలను ఉపయోగించాలని నిర్ణయించింది. తొలుత ప్రయోగాత్మకంగా సచివాలయ ఉద్యోగులతో ప్రారంభించి... తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది. ఒక ప్రఖ్యాత సంస్థ ఇటీవల ప్రత్యేక వైద్య పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. దానిని చేతికి పెట్టుకొంటే రక్త పోటును పరిశీలించి, వివరాలను దానంతట అదే వెబ్‌సైట్‌కు పంపిస్తుంది.
అలాగే... ఒక్క రక్తపు చుక్క ఆధారంగా పది నుంచి పదిహేను రకాల ఆరోగ్య విశ్లేషణలను చేస్తుంది. మొత్తం సమాచారాన్ని ఇంటర్నెట్లోని సంబంధిత వెబ్‌సైట్‌కు పంపిస్తుంది. ప్రతి వ్యక్తికి సంబంధించి ఒక కోడ్‌ను కేటాయిస్తారు. ఆ వెబ్సైట్లోకి వెళ్లి, తమకు కేటాయించిన నంబర్‌ను ఇవ్వగానే... రక్త పరీక్షల వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే... కేవలం సాంకేతిక అంశాలను మాత్రమే చెప్పి వదిలివేయకుండా, ఆ ఫలితాలను విశ్లేషించేలా రిపోర్ట్స్ ఉంటాయి. ఉదాహరణకు... తిన్న తర్వాత బ్లడ్ షుగర్ 200 వచ్చిందనకుందాం! అది ఎక్కువా, తక్కువా, ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ వైద్యుడిని సంప్రదించాలి... ఇలాంటి సూచనలన్నీ ఇస్తారు.
అది కూడా... తెలుగులోనే! ప్రస్తుతం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఖర్చుతో కూడుకున్న పని. ఏదైనా వ్యాధి బారిన పడితే... డాక్టర్ల సూచనమేరకు పరీక్షలు చేయించుకుంటున్న వారే ఎక్కువ. ప్రతినెలా ప్రాథమిక స్థాయిలో పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్సతోపాటు జాగ్రత్తలు తీసుకుంటే... ‘చికిత్స కంటే నివారణ మంచిది’ అనే నానుడిని పాటించినట్లవుతుంది. పైగా... ఈ పరికరం ద్వారా పరీక్షలు, విశ్లేషణ దానంతట అదే జరుగుతుంది. వయసు, బరువు, స్త్రీలా, పురుషులా... వంటి ప్రాథమిక వివరాలనూ పరిగణనలోకి విశ్లేషిస్తుంది. రాష్ట్రంలోని వారికి ఈ పరీక్షలు ప్రతి నెలా చేయగలిగితే మెరుగైన ఫలితాలు లభిస్తాయని, సమస్యలు ముందుగానే బయటపడి చికిత్స తేలిక అవుతుందని సీఎం భావిస్తున్నారు.