అమరావతి రాజధాని ప్రాంతానికి మణిమకుటమైన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం రేపటి నుంచి కొత్త కళ సంతరించుకోబోతుంది... మార్చి ఒకటి నుంచి, గన్నవరం ఎయిర్పోర్ట్ మరింత సందడిగా మారనుంది.. ఇప్పటివరకు ప్రతి రోజు 41 సర్వీసులు నడుస్తూ ఉండగా, రేపటి నుంచి మరో 12 కొత్తగా వచ్చి చేరుతున్నాయి... దీంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ లో, ప్రతి రోజు నడిచే సర్వీసుల సంఖ్య 53కు చేరనుంది.. వీటిలో భాగంగానే విజయవాడ నుంచి కడపకు తొలి విమాన సర్వీసు మార్చి ఒకటిన ప్రారంభం కాబోతోంది. కేంద్ర ప్రభుత్వ ఉడాన్ పథకంలో భాగంగా రీజినల్ కనెక్టివిటీ స్కీమ్(ఆర్‌సీఎం) కింద గన్నవరం నుంచి ప్రారంభమవుతున్న తొలి విమాన సర్వీసు కూడా ఇదే. అతి తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోనికి తేవడంతో పాటు చిన్న పట్టణాలు, నగరాల మధ్య అనుసంధానం ఏర్పాటు చేయడంలో భాగంగా కేంద్రం ఉడాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
తొమ్మిది నెలల కిందట 2017 ఏప్రిల్ 27న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద నడిచే సర్వీసులు ఇప్పటివరకూ గన్నవరం నుంచి లేవు. ఉడాన్ పథకంలో భాగంగా విజయవాడ నుంచి ప్రారంభమవుతున్న తొలి సర్వీసు ట్రూజెట్ విమానయాన సంస్థ నడుపుతోంది. రూ.700 ప్రారంభ ధర నుంచి ప్రయాణికులు టిక్కెట్లు కొనుగోలు చేశారు. ఉడాన్‌లో భాగంగా నడిచే విమాన సర్వీసులకు టిక్కెట్ ధర రూ.2500 లోపే ఉంటుంది. విజయవాడ నుంచి కడపకు ఈ సర్వీసు నిత్యం నడుస్తుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చి ఇక్కడి నుంచి కడపకు వెళుతుంది. తిరిగి కడప నుంచి ఇక్కడికి వచ్చి మళ్లీ హైదరాబాద్‌కు వెళుతుంది. రోజూ ఉదయం 7.45కు హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుతుంది. ఇక్కడి నుంచి ఉదయం 8.05కు కడపకు బయలుదేరుతుంది. తిరిగి కడప నుంచి బయలుదేరి ఉదయం 10.45కు విజయవాడ చేరుతుంది. ఉదయం 10.55కు బయలుదేరి హైదరాబాద్‌కు వెళుతుంది.
చెన్నైకు ఉదయం సర్వీసు.. విజయవాడ నుంచి చెన్నైకు వెళ్లాలంటే ప్రస్తుతం మధ్యాహ్నం 12.35కు ఎయిరిండియా సర్వీసు ఉంది. దాని తర్వాత మళ్లీ మధ్యాహ్నం 2, సాయంత్రం 5.20కు స్పైస్‌జెట్ సర్వీసులు చెన్నై వెళ్లేందుకున్నాయి. తాజాగా మార్చి ఒకటి నుంచి స్పైస్‌జెట్ సంస్థ ఉదయం 10.30కు విజయవాడ నుంచి చెన్నైకు కొత్త సర్వీసును ప్రారంభిస్తోంది. దీనివల్ల ఉదయం 10.30కు విజయవాడలో బయలుదేరి 11.45కు చెన్నైకు చేరిపోవచ్చు. నిత్యం నగరం నుంచి నడుస్తున్న మూడు సర్వీసులకూ భారీ డిమాండ్ ఉంది. దీంతో ఉదయం వేళ మరో సర్వీసును స్పైస్‌జెట్ ప్రారంభిస్తోంది. మార్చి రెండు నుంచి ఇండిగో సంస్థ సైతం నిత్యం పది సర్వీసులను హైదరాబాద్, బెంగళూర్, చెన్నైలకు ప్రారంభిస్తోంది.