రాజకీయాలకు ప్రజలు బలి అవ్వటం అంటే ఇదేనేమో.. ఎక్కడ ప్రజలకు మంచి జరిగితే, ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుందో అని, కొంత మంది ఎప్పుడూ మంచి కార్యక్రమాలను ఆపటానికి రెడీగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'బసవతారకం కిట్స్' పంపిణీకి సిద్ధమవుతున్న సమయంలో ఆ పథకానికి హైకోర్టు బ్రేక్ వేసింది... ఈ పథకం టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ కొంత మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా... పథకం అమలుపై స్టే విధించింది హైకోర్టు. వారి వాదనలు విన్న న్యాయమూర్తి, దీనిపై ప్రభుత్వ వివరణ కోరుతూ, తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారు.
రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బసవతారకం కిట్లను పంపిణీచేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో... కిట్ల పంపిణీకి అధికారయంత్రాంగం సిద్ధమవుతున్న సమయంలో ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా బాలింతలకు 'బసవ తారకం మదర్ కిట్' పేరుతో... ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే మహిళలకు ఈ కిట్లను అందజేయాలని నిర్ణయించారు. ఈ పథకానికి రూ. 37.37 కోట్లను కేటాయించి ఏపీ సర్కార్... ఒక్కో కిట్ విలువ రూ. 1,038గా నిర్ణయించింది. ఈ కిట్‌లో బాలింతలకు మాతృత్వ కానుకగా ఒక చీర, రెండు స్కార్ఫ్‌లు, ఒక బ్లాంకెట్, 40 శానిటరీ నాప్ కిన్స్, ఫ్లాస్క్ అందించనుంది.
చీర, ప్లాస్క్, స్కార్ప్, దుప్పటి, శానిటరీ నాప్‌కిన్స్...ఈ ఐదు వస్తువులను ఒక కిట్‌లో పెట్టి బాలింతలకు అందించనుంది. ఈక్రమంలో మంగళవారం ఉండవల్లి ప్రజావేదిక హాలులో 'బసవ తారకం మదర్ కిట్లను' ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా కొందరు బాలింతలకు అందజేశారు. ఆ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ "ఆస్పత్రిలో అడుగుపెట్టి పురుడుపోసుకొని పండంటి బిడ్డను కన్న తల్లి. ఏ దశలోనూ ఎలాంటి ఇబ్బందికీ గురి కాకూడదని, తల్లిబిడ్డలు సంతోషంగా ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆశయం"...అని చెప్పారు. అయితే ఈ పథకం అమలుకు ఎంపిక చేసిన సంస్థను నిబంధనలకు విరుద్దంగా చేశారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన క్రమంలో కోర్టు ఆదేశాలను అనుసరించి ఈ పథకం అమలు నిలిచిపోయింది. ప్రభుత్వం మాత్రం, అన్నీ పధ్ధతి ప్రకారమే చేసామని, అన్ని విషయాలు కోర్ట్ కి చెప్తామని అంటుంది.