రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తోన్న కొందరు ఐఎఎస్,ఐపిఎస్ అధికారులపై రాజ్యసభ సభ్యుడు 'విజయసాయిరెడ్డి' ఆరోపణలకు, ఇప్పటికే ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు ఘాటుగా స్పందించారు... అయితే, వీరికి బాసటగా, ఏ రాజకీయ పార్టీ ఇప్పటివరకు మాట్లాడలేదు... ముఖ్యంగా తెలుగుదేశం నేతలు కూడా ఎవరూ స్పందించకపోవటం కొంచెం చర్చనీయంసం అయ్యింది... ఈ నేపధ్యంలో, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలపై కేసు నమోదు చేయాలని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డీజీపీకి లేఖ రాశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీపై కేసు నమోదు చేయాలని లేఖలో ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్‌లను కించపరిచేలా విజయసాయిరెడ్డి మాట్లాడారన్నారు. గతంలో కూడా ఐఏఎస్, ఐపీఎస్‌లను జగన్ బెదిరించారని రాయపాటి లేఖలో వివరించారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనందున జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరిపై కేసు నమోదు చేయాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన జగన్, విజయసాయిలపై ఐపీసీ సెక్షన్ 504, 505 1 (బీ), బెదిరింపులకు పాల్పడినందుకు 506 (2), 124 (ఎ), 307 ఆర్డబ్ల్యూ, 511తో పాటు ఉద్రిక్తలు రెచ్చగొట్టడం.. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి పరువు నష్టం కలిగించినందుకు ఐపీసీ సెక్షన్ 500 కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని రాయపాటి లేఖ ద్వారా డీజీపీకి విజ్ఞప్తి చేశారు.
అలాగే, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఖండించారు. విధి నిర్వహణలో భాగంగా అధికారులు తమ విధులను నిర్వహిస్తారని, ప్రభుత్వాలు మారుతాయి కానీ... అధికారులు మారరని, వారి పని వారు చేస్తుంటారని అన్నారు. అధికారులకు రాజకీయాలు అంటగట్టడం సరికాదని విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే సతీశ్‌చంద్ర సంగతి చూస్తామని హెచ్చరించడం బాధ్యతా రాహిత్యమని సంఘం రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి సతీశ్‌చంద్ర నిస్వార్థంగా సేవలందిస్తున్నారని.. అమరావతి నుంచి పాలన నడిచేలా తగిన ఏర్పాట్లు ఒక క్రమపద్ధతిలో చేసుకుంటూ వస్తున్నారని వివరించారు. అనేక సవాళ్లతో లక్ష్యాలను సాధించేందుకు శ్రమిస్తున్న సివిల్ సర్వీసు అధికారుల మనోధైర్యం దెబ్బతీసేలా మాట్లాడడం తగదని పేర్కొన్నారు.