ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ముగ్గురు తెలుగుదేశం ఎంపీలు కాగా, కేంద్రం మెడలు వంచి విభజన హామీలు సాధిస్తారని, వైసీపీ పార్టీకి 22 మంది ఎంపీలను గెలిపించారు. అయితే ఇప్పుడు ఈ 25 మంది ఎంపీలు, ఈ ఏడాదిలో ఏమి చేసారు ? ఎవరెవరు, ఎన్ని రోజులు పార్లమెంట్ కు వెళ్లారు ? ఎన్ని చర్చల్లో పాల్గున్నారు ? కేంద్రానికి ఎన్ని ప్రశ్నలు వేసారు ? రాష్ట్రానికి సంబధించిన ఎన్ని అంశాలు లేవనెత్తారు ? నవ్యాంధ్ర వాణి వినిపించారా ? ఈ 25 మందిలో ఎవరు బెస్ట్ ? ఎవరు లాస్ట్ ? ఇలాంటి అన్ని అంశాల పై యువగళం అనే సంస్థ ఒక నివేదికను సిద్ధం చేసింది. ఏడాది కాలంలో, మన ఎంపీల పెర్ఫార్మన్స్ చెప్పింది. గడిచిన ఏడాది కాలంలో, పార్లమెంట్ ఎంపీల పని తీరు పై, యువగళం అధ్యయనం చేసింది. అంశాల వారీగా ఒక్కొక్కరి పనితీరుని విశ్లేషించింది. మొత్తంగా 25 మందిలో, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు, ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఈయన 97 శాతం సభకు హాజరు అయ్యారు.
91 ప్రశ్నలు వేసి, 42 చర్చల్లో పాల్గున్నారు. ఇక రెండో స్థానంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. 93 శాతం హాజరుతో, 91 ప్రశ్నలు అడిగిన గల్లా, 36 చర్చల్లో పాల్గున్నారు. మూడో స్థానంలో, కాకినాడ ఎంపీ వంగా గీత ఉన్నారు. 88 శాతం హాజరుతో, వంద ప్రశ్నలు అడిగిన గీత, 33 చర్చల్లో పాల్గున్నారు. నాలుగో స్థానంలో శ్రీకాకుళం ఎంపీ, రామ్మోహన్ నాయుడు నిలిచారు. 93 శాతం హాజరుతో, 69 ప్రశ్నలు అడిగిన రామ్మోహన్, 34 చర్చల్లో పాల్గున్నారు. అయితే చివరి స్థానంలో, బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ చివరి స్థానంలో నిలిచారు. 50 శాతం హాజరు ఉన్న సురేష్, ఒక్క ప్రశ్న కూడా ఇప్పటి వరకు అడగలేదు. ఒక చర్చలో పాల్గున్నారు. చివరి నుంచి రెండో స్థానంలో కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ నిలిచారు. 76 శాతం హాజరుతో, 14 ప్రశ్నలు అడిగిన ఆయన, ఒక చర్చలో పాల్గున్నారు.
చివరి నుంచి మూడో స్థానంలో, ఎంవీవీ సత్యన్నారాయణ, 75 శాతం హాజరుతో, 35 ప్రశ్నలు అడిగి, ఒక చర్చలో పాల్గున్నారు. 50 శాతం కంటే తక్కువ హాజరు ఉన్న ఎంపీగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు. అలాగే సగటు వయసు తీసుకుంటే, టిడిపి ది 47 ఉండగా, వైసీపీ ది 51 ఉన్నట్టు తెలిపారు. అలాగే పార్లమెంట్ హాజరు చూస్తే , టిడిపి ది 92 శాతం ఉండగా, వైసీపీ ది 79 శాతం ఉన్నట్టు తెలిపారు. టిడిపి ఎంపీలు సగటున 71 ప్రశ్నలు అడిగితె, వైసీపీ 46.3 ప్రశ్నలు అడిగారు. అలాగే చర్చల్లో టిడిపి సగటున 26.6 చర్చల్లో పాల్గుంటే వైసీపీ 11.1 చర్చలో పాల్గున్నారు.