జగన్ మోహన్ రెడ్డి మాట తప్పం, మడం తిప్పం అంటూనే, ఆయన అధికారంలోకి రాగానే ప్రతి అంశం పై మాట తప్పుతూ, మడం తిప్పుతున్నారు. తాజగా మరో సున్నితమైన అంశాన్ని కదిపి, ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి చేతులారా తెచ్చుకున్నారు. మాదిగా వర్గీకరణ అంశం పై, అసెంబ్లీలో మాట్లాడుతూ, జగన్ మాట మార్చారు. చంద్రబాబు ఈ అంశాన్ని రాజకీయం కోసం వాడుకున్నారు అంటూ, చంద్రబాబు వర్గీకరణకు మద్దతు తెలిపిన అంశం పై, మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసారు. నిజానికి జగన్ మోహన్ రెడ్డికి అధికారం రాక ముందు వర్గీకరణకు మద్దతు తెలిపారు. 2010లో మన్మోహన్ ప్రధానిగా ఉండగా, వర్గీకరణకు మద్దతు తెలుపుతూ లేఖలు కూడా రాసారు. అప్పట్లో, ఇది మా నాన్న మాట ఇచ్చిన అంశం అంటూ, జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేసే వారు.
అయితే ఇప్పుడు అధికారం రాగానే మాట మార్చారు. ఇదే అంశం పై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ జగన్ మోహన్ రెడ్డిని నిలదీశారు. అయితే జగన్ మాత్రం, ఈ అంశం పై మాట మార్చిన దానికే కట్టుబడి ఉండటంతో, ఎంఆర్పీఎస్ మరోసారి ఉద్యమ బాట పట్టింది. రేపు అసెంబ్లీని ముట్టడించేందుకు ఎంఆర్పీఎస్ పిలుపిచ్చింది. ఈ నేపధ్యంలో, ఎంఆర్పీఎస్ నేతలు, కార్యకర్తలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎలా అయినా అసెంబ్లీ ముట్టడిని సక్సెస్ చెయ్యాలనే ఉద్దేశంతో, వారు పోలీసులు ముందస్తు ఆర్రేస్ట్ చేస్తారని, ముందుగానే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మరో పక్క పోలీసులు వీరి అసెంబ్లీ ముట్టడిని భగ్నం చేసేందుకు ప్రతివ్యూహంతో ముందుకు వస్తున్నారు. దీంతో రేపు అసెంబ్లీ వద్ద ఏమి జరుగుతుందా అనే టెన్షన్ వాతావరణం నెలకొంది.
పోలీసులు ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తలు, నాయకుల కోసం ఈ రోజు రాత్రి నుంచే గాలిస్తున్నారు. వారు ఊరు దాటి అమరావతి వైపు రాకుండా చూస్తున్నారు. అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదని, ఇటు వైపు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.గుంటూరు అర్బన్, రూరల్ జిల్లా పరిధిలో 30 పోలీస్ యాక్ట్‌తో పాటు 144వ సెక్షన్ అమలులో ఉందని, ఇటు వైపు వచ్చి ఆందోళనలు చేస్తే, తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరో పక్క, గతంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రాజధాని ప్రాంతంలో నిర్వహించ తలపెట్టిన కురుక్షేత్ర సభను పోలీసులు అడ్డుకోవటంతో, జీపు దహనంతో పాటు పలు విధ్వంసకర చర్యలు పాల్పడిన చరిత్ర ఉండటంతో, రేపటి అసెంబ్లీ ముట్టడి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయా అనే టెన్షన్ నెలకొంది. పోలీసులు మాత్రం, ఏ చిన్న ఇబ్బంది కూడా లేకుండా చూస్తామని అంటున్నారు.