వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాపు నేత ముద్రగడ పద్మనాభం వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన జగన్ కు సవాల్ విసిరారు. మాటతప్పని మడమ తిప్పని నాయకుడు తన పాదయాత్రలో ఒక్కో సభలో ఒక్కో రకంగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఏర్పాటు చేసిన కాపు సేవ సమితి వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ముద్రగడ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు రూ.5వేలు కోట్లు ప్రకటిస్తే, వైకాపానేత జగన్ రూ.10వేల కోట్లకు తమను కొనడానికి సిద్దమవుతున్నారని విమర్శించారు.
రూ.20వేల కోట్లు ఇస్తాం ముఖ్యమంత్రి పదవి కాపులకుగాని బీసీ లకు, దళితులకు ఇస్తారా అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్ హామీని కేంద్రం పరిధిలో నెట్టివేయకుండా, చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ..కాపు రిజర్వేషన్ ను 9వ షెడ్యూల్ లో చేర్చి అమలు చేయాలన్న వ్యాఖ్యలను ముద్రగడ స్వాగతించారు. జగన్ రాజ్యాంగాన్ని చదివినట్లు మొసలి కన్నీరు కార్చవద్దని, ఆయన సానుభూతి తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. కాపులకు ఏ పార్టీ న్యాయం చేస్తే.. 2019లో ఆపార్టీ పల్లకి మోస్తామని ముద్రగడ తెలిపారు.
మరో పక్క ముద్రగడ వ్యాఖ్యల పై వైసిపీ స్పందించింది. యూటర్న్ తీసుకుని వైసీపీ అధినేత జగన్ ను విమర్శించడం సరికాదు అని వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాపు ఉద్యమంపై ముద్రగడ పద్మనాభం ఎందుకు యూటర్న్ తీసుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తునిలో మీరు మీటింగ్ పెడితే లక్ష మంది వచ్చారు. సామాజికవర్గ ప్రయోజనాల కోసం ముద్రగడ పోరాడితే మద్దతిచ్చాం అని గుర్తు చేశారు. కడప నుంచి మనుషులు వచ్చి రైలు తగలబెట్టారంటే మీరు ఏం చేశారన్నారు. రైలు దహనం తర్వాత 13 జిల్లాల్లోని కాపులను అరెస్ట్ చేస్తే అప్పుడేమయ్యారని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు.