కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పయనమెటు అనేది చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికలలో ఆయన ఎవరికి మద్దతు ఇస్తారనే విషయం పై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ తూర్పు పర్యటనతో కాపు రిజర్వేషన్ల అంశం మరోమారు తెరపైకి వచ్చింది. కాపులకు రిజర్వేషన్లు తాను ఇవ్వలేనని, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని జగన్ తేల్చిచెప్పడం, ఆ తర్వాత వచ్చిన విమర్శలతో జగన్ యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. జగన్ వ్యాఖ్యలను ముద్రగడ పద్మనాభం, కాపు జేఏసీ నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఉద్యమం పుట్టిన తూర్పు గడ్డపైనే జగన్ కాపు ఉద్యమానికి తూట్లు పొడిచేలా వ్యవహరించారంటూ, మరో నాయకుడు ఈ తరహా వ్యాఖ్యలు చేయకుండా కాపు నేతలు స్పందిస్తున్నారు. కాపు ఉద్యమ సమయంలో మద్దతు ఇచ్చి ఇప్పుడు ఎందుకు మాట తప్పారని జగన్‌ను ప్రశ్నిస్తున్నారు. కాపు రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చిన వారికే కాపులు ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. 2016 ఫిబ్రవరి నుండి కాపు ఉద్యమానికి జగన్ మద్దతు ఇవ్వడంతో వైసీపీకి ముద్రగడ మద్దతు ఉందని భావించిన అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆ పరిస్థితి లేదని భావించి ముద్రగడ వైపు దృష్టి మళ్ళించారు. ముద్రగడ పద్మనాభంను తమ వైపు తిప్పుకుంటే, కొంత అయినా కాపు ఓట్లను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని అన్ని పార్టీలు ప్రయ త్నాలు చేస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు కూడా ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని, కాపులకు రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి ముద్రగడను కలిసి వివరిస్తూ ఏఐసీసీ ఇచ్చిన హామీ లేఖను కూడా ముద్రగడకు ఇచ్చారు. ఇదిలాఉంటే వైసీపీ అధినేత జగన్ కాపు రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నారని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. వైసీపీలో ఉంటూ కాపు ఉద్యమంలో పనిచేస్తున్న కొంతమంది కాపు నేతలు కూడా ముద్రగడను కలిసి వైసీపీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్లపై ఎటూ తేల్చడం లేదు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే వద్దన బోమని చెబుతూనే కులం పరంగా తాను ఏ నిర్ణయం తీసుకోనని తేల్చిచెప్పారు. ఇలా అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించడంతో ఏ పార్టీకి ముద్రగడ మద్దతు ఇస్తారోననే మీమాంస కొనసాగుతోంది. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కాపులకు రిజర్వేషన్లు మేమే ఇస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేది టీడీపీయేనని, ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌లో కూడా పంపించింది. కాపు కార్పొరేషన్ పెట్టి, ఆడుకుంటుంది. వైసీపీ నాయకులు రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పడం, పవన్ ఎటూ తెల్చకపోతంతో, ఇప్పటి వరకు, ఈ అంశంలో టీడీపీ మాత్రమే స్పష్టత ఇచ్చింది.
అయితే ముద్రగడ ప్రస్తుత పరిస్థితుల్లో కాపు రిజర్వేషన్లకు అనుకూలంగా అడుగులు వేసున్న అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారా? లేక ఇతర పార్టీలకు మద్దతు ఇస్తారా? అనేది తేలాల్సిఉంది. కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి న్యాయం చేకూర్చేందుకు చంద్రబాబు ప్రయత్నించాలని ముద్రగడ కోరుతున్నారు. చంద్రబాబు ఈ అంశంపై సానుకూల వైఖరితో ఉన్నందున ముద్రగడ ఇప్పటివరకూ దుయ్యబట్టిన చంద్రబాబుకు మద్దతు ఇస్తారా? లేక యథావిధిగా తన పోరాటాన్ని కొనసాగిస్తారా? అనేది తేలాల్సిఉంది. అయితే టీడీపీ పట్ల ముద్రగడ వైఖరిలో కొంత మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది. నిన్నటివరకూ సీఎం చంద్రబాబుకు ముద్రగడ రాసే ప్రతి లేఖ కొంత వ్యంగ్యంగా కనిపించేది. కానీ తాజాగా రాసిన లేఖలో మర్యాదపూర్వకంగానే సంబోధిస్తూ కాపు జాతికి న్యాయం చేయాలని కోరడం విశేషం. ఏదిఏమైనా ముద్రగడ కాపు రిజర్వేషన్ల సాధనకు చేస్తున్న పోరాటాన్ని కొనసాగిస్తూనే తమకు మద్దతు ఇచ్చేవారికే తమ మద్దతు ఉంటుందని చెప్పడం టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు పరోక్షంగా చెప్పడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.