మల్టీప్లెక్స్... ఏదైనా సినిమాకి వెళ్తే చాలు దోచేస్తారు... ఇది ఒక మాఫియా... ప్రజలను దోచేస్తారు... నియంత్రణ లేక, అడిగేవారు లేక చలరేగిపొతూ ఉంటారు... కనీసం మంచి నీళ్ళు కూడా లోపలకి తీసుకు వెళ్ళనివ్వరు... లోపల కొందాం అంటే MRP మీద, నాలుగు అయిదు రెట్లు ఎక్కువ అమ్ముతారు.. ఏదైనా తిందాం అంటే, కనీసం 250 రూపాయలు పెట్టాలి... అయితే ఇప్పుడు ఈ దోపిడీకి చెక్ వినియోగదారుల ఫోరం. పరిస్థితిని నియంత్రణలోకి తేవాలని, మాల్స్‌లో జరుగుతున్న దోపిడీ అరికట్టాలని ఆదేశించారు...
విజయవాడలో మల్టీప్లెక్సుల్లో అధిక ధరలకు ఆహార పదార్థాల అమ్మకంపై వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు చెప్పింది. ఐదు మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు వినియోగదారుల ఫోరం జడ్జి మాధవరావు రూ.5లక్షల భారీ జరిమానా విధించారు. అలాగే ఎల్‌ఈపీఎల్, ట్రెండ్ సెట్, పీవీఆర్, పీవీపీ, ఐనాక్స్ మల్టీప్లెక్స్ పై చర్యలు తీసుకోవాలని తీర్పునిచ్చారు. ప్రజలు బయట నుంచి తెచ్చుకునే ఆహారపదార్థాలు, తాగునీటికి అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. ఆదేశాలు తప్పక అమలు చేయాలని అధికారులకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తమ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని తూనికలు, కొలతల శాఖను ఆదేశించింది.
విజయవాడలోని కొన్ని మల్లీఫ్లెక్స్ థియేటర్లలో టిక్కెట్లు, ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ కొందరు వినియోగదారులు మార్గదర్శక సమితి సహకారంతో గతేడాది ఏప్రిల్‌లో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఎల్‌ఈపీఎల్, ట్రెండ్‌సెట్, పీవీఆర్, పీవీపీ, ఐమ్యాక్స్ మల్టీఫ్లెక్స్ థియేటర్లపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై మల్లీఫ్లెక్స్ యాజమాన్యాలు, తూనికలు, కొలతల శాఖను న్యాయస్థానం ప్రతివాదులుగా చేర్చింది. గతేడాది నుంచి దీనిపై పలుమార్లు వాద ప్రతివాదనలు జరిగాయి. సమగ్ర విచారణ చేసిన న్యాయమూర్తి మాధవరావు ఈ అంశంపై గురువారం సంచలన తీర్పు వెలువరించారు.
నగరంలోని ఐదు థియేటర్ల యాజమాన్యాలు తినుబండారాలపై ఎమ్మార్పీ కంటే మూడురెట్లు అధికంగా ధర ముద్రించి వినియోగదారులను మోసం చేసినట్లు న్యాయమూర్తి తీర్పులో వెల్లడించారు. దీంతో వినియోగదారులు నష్టపోయిన మొత్తాన్ని 9శాతం వడ్డీతో పరిహారం చెల్లించాలని మల్టీఫ్లెక్స్ యాజమాన్యాలను ఆదేశించారు. ఒక్కక్కరికి రూ.5లక్షల చొప్పున మొత్తం రూ.25లక్షల జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని రెండు నెలల లోపు జిల్లా వినియోగదారుల ఫోరం వద్ద జమ చేయాలని తీర్పులో ఆదేశించారు. ఇలాంటి మోసాలకు పాల్పడటం తీవ్రమైన తప్పిదమని.. భవిష్యత్‌లో ఇలాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. థియేటర్లకు వచ్చే వినియోగదారులకు ఉచిత తాగునీరు సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని, బయట నుంచి తీసుకొచ్చే ఆహార పదార్థాలు, శీతల పానీయాలను అనుమతించాలని ఆదేశించారు.