శుక్రవారం జరిగిన టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో, రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ చేసిన ఒక ప్రతిపాదనతో చంద్రబాబు అవాక్కయ్యారు... ప్రత్యేక హోదా సహా కేంద్రం ఇచ్చిన హామీల అమలు కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని చంద్రబాబు అడగగా, రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ ఒక ఐడియా ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి 600 సైకిళ్లు చొప్పున మొత్తం లక్ష సైకిళ్లతో నిరసన ప్రదర్శన నిర్వహిద్దామని, మన ఎన్నికల గుర్తు కూడా సైకిలే కాబట్టి మన సైకిల్ దెబ్బకు కేంద్రం దద్దరిల్లుతుందని రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ పేర్కొన్నారు. ‘‘ప్రదర్శన ఎక్కడికి.. అమరావతికా! దిల్లీకా!’’ అని చంద్రబాబు అడగడంతో సమావేశం నవ్వులతో నిండిపోయింది. ‘‘అయ్యయ్యో.. అమరావతికే.. దిల్లీకి అనుకుంటున్నారా!’’ అంటూ మురళీమోహన్ వివరించే ప్రయత్నం చేశారు.
ఎమ్మెల్యేలు అమరావతికి, ఎంపీలు దిల్లీకి సైకిల్ యాత్రలు చేస్తే బాగుంటుందని మరికొందరు చమత్కరించారు. మురళీమోహన్ సినీ నటుడు కాబట్టి, ఆయన అలాంటి ప్రతిపాదన చేశారని, అది ఊహించుకోవడానికి బాగానే ఉందని, ఆచరణలో ఎంత వరకు సాధ్యమో చూడాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘‘అది చేస్తే మెగా ఈవెంట్ అవుతుంది. అయితే వేసవిలో కాకుండా సమయం సందర్భం చూసుకుని చేస్తే బాగుంటుందని’’ సీఎం అభిప్రాయపడ్డారు. సమావేశంలో పాల్గొన్నవారిలో ఎవరూ ఈ ప్రతిపాదనతో ఏకీభవించలేదు. మురళీమోహన్ పలు సందర్భాల్లో జోక్యం చేసుకుని సలహాలు, సూచనలు ఇచ్చారు. మురళీమోహన్ మంచి నటుడని, కానీ పార్టీకి ఏమీ ఉపయోగపడటం లేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నవ్వుతూ వ్యాఖ్యానించారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు కూడా కొన్ని ప్రతిపాదనలు చేశారు.
ధర్మపోరాట దీక్షకు తిరుపతి, విజయవాడలో మంచి స్పందన వచ్చింది. దిల్లీలోనూ చేస్తే కేంద్రం దిగి వస్తుంది అని జీవీ ఆంజనేయులు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన అన్యాయాన్ని వివరిస్తూ ఇతర రాష్ట్రాల్లోనూ బహిరంగ సభలు నిర్వహించాలి. నమ్మక ద్రోహాన్ని వివరిస్తూ అక్కడి ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ పట్ల సానుభూతి పెంచాలి అని నిమ్మల కిష్టప్ప అన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 100 మంది చొప్పున 175 నియోజకవర్గాల వారు 175 రోజులు దిల్లీకి వెళ్లి దీక్ష చేయాలి. చివరి రోజు భారీ బహిరంగసభలో చంద్రబాబు పాల్గొనాలి. మన పోరాటాన్ని దిల్లీకి మార్చాలి అని ఎస్వీ మోహన్‌రెడ్డి సలహా ఇచ్చారు.